
పాకిస్థాన్‌లో మైనారిటీల భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సింధ్ రాష్ట్రంలో ఒక మైనర్ హిందూ బాలికను అపహరించి, బలవంతంగా మత మార్పిడి చేసి వివాహం జరిపించారని ఆరోపణలు వెల్లువెత్తాయి.
‘వాయిస్ ఆఫ్ పాకిస్థాన్ మైనారిటీ’ అనే సంస్థ ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ, దేశంలో ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్నాయని పేర్కొంది. హిందూ బాలికల భద్రతపై సింధ్ ప్రాంతంలో కుటుంబాలు నిరంతరం భయంతో జీవిస్తున్నాయని ఆ సంస్థ ఆవేదన వ్యక్తం చేసింది.
సంస్థ అందించిన వివరాల ప్రకారం, 9వ తరగతి చదువుతున్న పూజ అనే బాలికను అపహరించి, బలవంతంగా ఇస్లాంలోకి మార్చినట్లు ఆరోపించారు. అనంతరం ఆమె పేరును ‘దువా ఫాతిమా’గా మార్చి, ఇమ్రాన్ అలీ అనే వ్యక్తితో వివాహం జరిపించినట్లు సమాచారం.
ఇప్పటి వరకు ఈ ఘటనపై పోలీసులు లేదా న్యాయస్థానాల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో, ఈ కేసుపై పారదర్శక విచారణ జరపాలని మానవ హక్కుల సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి.
అలాగే, సింధ్‌లో పెరుగుతున్న అపహరణలు, బాల్య వివాహాలు, బలవంతపు మత మార్పిడుల ఘటనలను చట్ట ఉల్లంఘనలుగా పేర్కొంటూ, బాధితులకు రక్షణ కల్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాయి.





