
42views
మహారాష్ట్ర నాసిక్ లోని టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) లో లైంగిక వేధింపులు, మత మార్పిడి ఒత్తిళ్లు అంశం దేశ వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయం మరిచిపోకముందే నాగపూర్ లో అచ్చు ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ ఎన్జీవో యాజమాని రియాజ్ ఖాజీ సంస్థలో మత మార్పిళ్లు, లైంగిక వేధింపులకు దిగుతున్నారని ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. దీంతో రియాజ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.
రియాజ్ ఖాజీ నాగపూర్ కేంద్రంగా ఫికర్ ఫౌండేషన్, పఢేహమ్, పఘాయే హమ్ అనే స్వచ్ఛంద సంస్థలను నడుపుతున్నాడు. ఈ కార్యాలయాల్లో పనిచేస్తున్న వారిని బలవంతపు మత మార్పిళ్లు చేయడమే కాకుండా ఇస్లామిక్ సంప్రదాయ దుస్తులే వేసుకోవాలని, ఇస్లాంనే పాటించాలని ఉద్యోగులపై తీవ్రమైన ఒత్తీడి తెస్తున్నాడని మహిళా ఉద్యోగులు పేర్కొంటున్నారు.
మరోవైపు ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. ఖాజీని అరెస్ట్ చేశామని ప్రకటించారు. అసలు మతం మార్చుకోవాలని ఎంత మంది మహిళలను వేధించాడు? ఇంకా ఎలాంటి ఇబ్బందులకు గురి చేశాడో అన్న విషయాలపై లోతైన దర్యాప్తు చేస్తున్నామని ప్రకటించారు. ఈ దర్యాప్తులో మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసు విభాగం కూడా పాలు పంచుకుంటోందని పోలీసులు ప్రకటించారు.
ప్రధానంగా ఫిర్యాదుదారు HR మహిళా మేనేజరే…
ఈ ఘటన వెలుగులోకి రావడం వెనుక HR మహిళా మేనేజరే కీలక పాత్ర పోషించింది. జూలై 18, 2024న కార్యాలయంలో జరిగిన తన పుట్టినరోజు వేడుకల సందర్భంగా, ఖాజీ తనను తన క్యాబిన్‌కు పిలిచి, తన అనుమతి లేకుండా కౌగిలించుకున్నాడని, తన నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడని వెల్లడించారు. అయితే.. తాను ఉద్యోగం కోల్పోతానన్న భయంతోనే ఏమీ అనలేకపోయానని ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.ఖాజీ తనను చాలాసార్లు కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడని, ఒక సందర్భంలో తనను కౌగిలించుకోవడానికి ప్రయత్నించే ముందు సీసీటీవీ కెమెరాను ఆపివేశాడని కూడా పేర్కొంది.





