News

సత్యదేవుని కల్యాణానికి ఘనంగా ఏర్పాట్లు

51views

అన్నవరం రత్నగిరిపై ఈ నెల 26 నుంచి మే రెండో తేదీ వరకూ సత్యదేవుని వార్షిక దివ్య కల్యాణ మహోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని ప్రభుత్వ, అన్నవరం దేవస్థానం అధికారుల సమన్వయ కమిటీ సమావేశంలో నిర్ణయించారు. దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌ అధ్యక్షతన రత్నగిరిపై గురువారం జరిగిన సమావేశంలో నూతన ఈఓ నల్లం సూర్యచక్రధరరావు మాట్లాడుతూ, ఈ ఉత్సవాలకు అన్ని ప్రభుత్వ శాఖల అధికారులూ సహకరించాలని కోరారు. ఉత్సవాలకు దేవస్థానం చేపడుతున్న ఏర్పాట్లను వివరించారు. ఈ నెల 27వ తేదీ రాత్రి 9.30 గంటల నుంచి జరిగే సత్యదేవుని కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు వేలాదిగా భక్తులు వచ్చే అవకాశమున్నందున ఆ రోజు విస్తృత ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. సమావేశంలో పెద్దాపురం ఆర్‌డీఓ ఎన్‌కే శ్రీధర్‌, ప్రత్తిపాడు సీఐ సూర్య అప్పారావు, ఎస్సై హరిబాబు, దేవస్థానం డిప్యూటీ కమిషనర్‌ బాబూరావు, అసిస్టెంట్‌ కమిషనర్‌ మంజులాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణోత్సవాల వాల్‌ పోస్టర్‌ను ఆవిష్కరించారు.

సమావేశం నిర్ణయాలివీ..

● కల్యాణోత్సవానికి వచ్చే భక్తులు, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీలు, కల్యాణానంతరం తలంబ్రాలు, ప్రసాదం పంపిణీకి 9 కౌంటర్ల ఏర్పాటు. అందరికీ మంచినీరు అందించాలి.

● వీఐపీలకు స్వామివారి శేషవస్త్రం, తలంబ్రాలను వారివద్దకే అందించాలి. వారితో పాటు ఎవ్వరినీ కల్యాణ వేదిక వద్దకు అనుమతించరాదు.

● ఎటువంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా కల్యాణ వేదిక వద్ద బారికేడ్ల ఏర్పాటు.

● రత్నగిరి పైన, దిగువన, కల్యాణ వేదిక వద్ద విద్యుద్దీపాలంకరణ.

● కల్యాణం జరిగే 27వ తేదీ సాయంత్రం నుంచి పెద్ద వాహనాలను, ఆటోలను కొండ మీదకు అనుమతించరు. భక్తులు, గ్రామస్తుల కోసం 8 ఉచిత బస్సులు నడపాలి.

● శ్రీచక్రస్నాన మహోత్సవానికి పంపా నదిలో 100 అడుగుల నీటిమట్టం ఉండేలా ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవాలి.

● కల్యాణోత్సవం నాడు మధ్యాహ్నం 2 గంటల నుంచి, ఊరేగింపులు జరిగే ఐదు రోజులూ ఆ వేడుకలు పూర్తయ్యేంత వరకూ అన్నవరంలో సాయంత్రం నుంచి మద్యం దుకాణాలు బంద్‌ చేయాలి.

● ఉత్సవాల ఏడు రోజులూ అదనపు పారిశుధ్య సిబ్బందితో అన్నవరం గ్రామంలో పారిశుధ్యం మెరుగుపరచాలి.

● కల్యాణోత్సవం, శ్రీపుష్పయాగం నాడు ముందు జాగ్రత్తగా ఫైర్‌ ఇంజిన్లు సిద్ధంగా ఉంచాలి.

● కల్యాణోత్సవం నాడు 500 మంది, వాహనాల ఊరేగింపుల్లో 50 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు.

● కల్యాణోత్సవాలు జరిగే వారం రోజులూ పాయకరావుపేట ఫీడర్‌ నుంచి నిరంతరాయంగా విద్యుత్‌ సరఫరా.

● ఈ ఏడు రోజులూ రత్నగిరి పైన, దిగువన వైద్య శిబిరాల నిర్వహణ.

● దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తుల కోసం ప్రత్యేక బస్సులు.

● ఈ నెల 30వ తేదీ సాయంత్రం 4 గంటలకు 38 అడుగుల ఎత్తయిన టేకు రథంపై జరిగే సత్యదేవుని రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేయాలి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అన్నవరం మెయిన్‌ రోడ్డులో విద్యుత్‌ సరఫరా నిలిపివేయాలి. ఒకౖవైపు రోడ్డులో రథోత్సవం జరుగుతూండగా రెండోవైపు రోడ్డులో భక్తులు ఉండి తిలకించేలా ఏర్పాట్లు చేయాలి. మధ్యాహ్నం నుంచి మెయిన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ నిలిపివేయాలి. రథం లాగేందుకు నిపుణులను నియమించాలి. మెయిన్‌ రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉన్నందున రెండు వైపులా పగ్గాలతో రథాన్ని నియంత్రించాలి.

గతం కంటే వైభవంగా..
వాడపల్లి వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉత్సవాల మాదిరిగా సత్యదేవుని కల్యాణోత్సవాల్లో విశేషంగా పుష్పాలంకరణ చేయిస్తాం. వాడపల్లి పుష్పాలంకరణ వీడియోలను అన్నవరం దేవస్థానం సిబ్బందికి చూపించాం. అలాగే, విద్యుద్దీపాలంకరణ కూడా బాగా ఉండేలా చర్యలు తీసుకుంటాం. గతంలో కన్నా వైభవంగా కల్యాణోత్సవాలు నిర్వహిస్తాం.– నల్లం సూర్య చక్రధరరావు, ఈఓ, అన్నవరం దేవస్థానం