News

కార్పొరేట్ జిహాద్ పై బండి సంజయ్ ఘాటు స్పందన

54views

నాసిక్‌లో జరిగిన ‘కార్పొరేట్ జిహాద్’ కేసు నేపథ్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్  తీవ్రంగా స్పందించారు. హైదరాబాద్ ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగుల భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు. ఈ మేరకు బండి సంజయ్ కుమార్ ఓ ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా, ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులపై మతపరమైన ఒత్తిళ్లు, వేధింపులు, రహస్య నెట్‌వర్క్‌ల ప్రభావం ఉండకూడదని తెలిపారు. హైదరాబాద్‌లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారి పని వాతావరణం కేవలం కెరీర్ అభివృద్ధికి మాత్రమే పరిమితం కావాలని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వానికి సూచనలు..

ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వానికి బండి సంజయ్ కొన్ని కీలక సూచనలు చేశారు. అన్ని ప్రధాన ఐటీ కంపెనీల హెచ్‌ఆర్ బృందాలతో తక్షణ సమావేశం నిర్వహించాలని సూచించారు. ఉద్యోగుల భద్రతపై స్పష్టమైన విధానాలు రూపొందించాలని అన్నారు. ఉద్యోగుల ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఏ కేసును కూడా దాచిపెట్టకూడదని చెప్పుకొచ్చారు.

ఉద్యోగుల భద్రతపై ఆందోళన..

ఉద్యోగులు కార్యాలయాల్లో స్వేచ్ఛగా, భద్రతతో పనిచేసే వాతావరణం ఉండాలని బండి సంజయ్ కుమార్ సూచించారు. ఏ రకమైన ఒత్తిడి, వేధింపులు, దోపిడీకి అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. అలాగే, బాధితులు ఒంటరిగా ఉండకుండా వారికి తగిన రక్షణ, మద్దతు అందించాలని సూచించారు.

సోషల్ మీడియా ప్రస్తావన..

పలువురు ఉద్యోగులు ఇప్పటికే కార్యాలయాల్లో జరిగిన అనుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారని పేర్కొన్నారు. ఈ హెచ్చరిక సంకేతాలను ప్రభుత్వం, కంపెనీలు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.

కంపెనీల బాధ్యత..

ఐటీ కంపెనీల యాజమాన్యాలు, హెచ్‌ఆర్ విభాగాలు ఉద్యోగుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని బండి సంజయ్ కుమార్ కోరారు. ప్రతి ఫిర్యాదును నిష్పక్షపాతంగా, వేగంగా పరిష్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. నాసిక్ కేసు నేపథ్యంలో వచ్చిన ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ఐటీ రంగ భద్రతపై చర్చను మరింత పెంచాయని తెలిపారు. ఉద్యోగుల రక్షణ, కార్యాలయాల్లో పారదర్శకత, ఫిర్యాదు వ్యవస్థ బలోపేతం వంటి అంశాలు ఇప్పుడు కీలకంగా మారాయని పేర్కొన్నారు.