ArticlesNews

మతకలహాల ముసుగులో దాడులు

59views

ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల చోటుచేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. కొందరు దుండగులు మత కలహాల ముసుగులో కూటమి ప్రభుత్వ నాయకులనే లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఈ మూకలు ఒక పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఒక పాస్టర్ ఏకంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తలకే ఖరీదు కట్టడం సంచలనం సృష్టించింది. ఆ ఘటన మరువక ముందే. శాసనసభ ఉప సభాపతి రఘురామకృష్ణరాజుపై మారణాయుధాలతో దాడికి యత్నించడం ప్రకంపనలు సృష్టిస్తోంది.

పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలం లోని పెదపేట గ్రామంలో ఎంతో పురాతనమైన రామాలయం ఉంది. ఈ చారిత్రక ఆలయానికి సుమారు రెండు ఎకరాల విలువైన భూమి ఉంది. ఆ ఆలయం ఏళ్లు గడుస్తున్నా ఎలాంటి అభివృద్ధికి నోచుకోకుండా శిథిలావస్థకు చేరుకుంది. ఈ క్రమంలో ఉగాది పర్వదినం సందర్భంగా స్థానిక శాసనసభ్యుడు, శాసనసభ ఉపసభాపతి రఘురామ కృష్ణరాజు ఆ గ్రామాన్ని సందర్శించగా, ఆ ఊరిలోని కొందరు భక్తులు ఆయనను కలిసి, ఆలయ అభివృద్ధికి సహకరించాలని కోరారు. సరిగ్గా అదే సమయానికి అక్కడికి చేరుకున్న కొందరు వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా గొడవకు దిగారు. ఈ గ్రామంలో హిందువులు ఎవరూ లేరని, అందరూ క్రైస్తవ మతంలోకి మారిపోయారని వాదించారు. చుట్టుపక్కల అంతా క్రైస్తవులు ఉన్నందున ఇక్కడ రామాలయం కట్టడానికి వీల్లేదని దౌర్జన్యంగా మాట్లాడారు. పరిస్థితి చేయి దాటుతుండటంతో కొందరు పెద్దలు కల్పించుకుని రఘురామకృష్ణ రాజును అక్కడి నుంచి పంపించి వేశారు.

శ్రీరామనవమి నాడు పథకం ప్రకారం దాడి
ఉగాది రోజు జరిగిన గొడవను పక్కనపెట్టి, శ్రీరామనవమి పర్వదినాన స్వామివారిని వేసి దర్శించుకోవడానికి రఘురామ కృష్ణరాజు మళ్లీ పెదపేటకు వెళ్లారు. ఆయన రాకను ముందే పసిగట్టిన అల్లరిమూకలు భారీ ఎత్తున గుమిగూడాయి. రామాలయంలో ఎలాంటి పూజలు చేయడానికి వీల్లేదంటూ ఆయనను అడ్డుకున్నాయి. ఆయన ఎంతో భక్తితో శ్రీరాముని మెడలో వేసిన పూలదండను ఒక మహిళ అత్యంత అమానుషంగా లాగేసి బయటకు విసిరేసింది. ఆ వెంటనే ముందస్తు పథకంలో భాగంగా ఆ మూక దాచి ఉంచిన ఇనుప రాడ్లు, కత్తులు, మేకులు కొట్టిన కర్రలతో రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన అనుచరులపై దాడికి దిగింది. అప్రమత్తమైన పోలీసులు ఆయనను అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ దాడిలో అనిల్ కుమార్, వెజ్జు నాగసాయి అనే ఇద్దరు వ్యక్తులకు శరీరంపై కత్తిపోటు, తలలో మేకులు దిగడంతో తీవ్ర గాయాలపాలయ్యారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడంతో పోలీసులు గుంపును చెల్లాచెదురు చేశారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దాడిలో పాల్గొన్న 57 మందిపై పోలీసులు కేసులు నమోదుచేసి స్టేషన్ కు తరలించారు.

వితండవాదనల వెనుక అసలు కుట్ర
గ్రామంలో హిందువులు లేరని, అందువల్ల ఆలయం ఉండకూడదని గొడవ చేసిన వారి వాదనలో ఎలాంటి అర్థం లేదు. అక్కడ కొత్తగా గుడి కట్టడం లేదు.. పురాతన ఆలయాన్ని బాగు చేస్తున్నారు. ఒక మతం వారు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇతర మతాల ప్రార్ధనా మందిరాలు ఉండకూడదనే వితండవాదనను అంగీకరిస్తే, భారతదేశంలో మైనారిటీలకు చెందిన చర్చిలు, మసీదులు ఎన్నో కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ గమనించాల్సిన మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… తాము మతం మారామని గర్వంగా చెబుతున్న వారంతా ప్రభుత్వ రికార్డులలో హిందువుల పేరుతోనే చెలామణి అవుతున్నారు. హిందూ ధ్రువీకరణ పత్రాలతో ప్రభుత్వ పథకాలను అనుభవిస్తున్నారు. ఈ దాడి వెనుక అసలు కారణం మతం కాదు. ఆక్రమణ. రామాలయానికి చెందిన రెండు ఎకరాల భూమిని ఒక పాస్టర్ కబ్జా చేశాడని, ఆలయాన్ని అభివృద్ధి చేస్తే ఆ భూమిని తిరిగి ఇచ్చేయాల్సి వస్తుందనే భయంతోనే అతడు ఇలాంటి మూకలను ఉసిగొల్పినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఒక ఉన్నత స్థాయి పోలీసు అధికారి హస్తం దాడి వెనుక ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

‘ఘర్ వాపసీ’ భయంతోనే ఉన్మాదం
గతంలో వివిధ ప్రలోభాలకు గురై మతం మారిన వారిలో చాలామంది ఇప్పుడు వాస్తవాలను గ్రహిస్తున్నారు. తాము మోసపోయామని తెలుసుకుని తిరిగి మాతృ మతంలోకి (ఘర్ వాపసీ) రావడానికి ఆసక్తి చూపుతున్నారు. కానీ పాస్టర్లు వారిని బెదిరిస్తూ అద్దుకుంటున్నారు. ఇటీవలి కాలంలో హిందూ సంఘాలు చురుగ్గా పనిచేస్తూ మత మార్పిడులను గట్టిగా నిలువరిస్తున్నాయి. సనాతన ధర్మం మీద జరుగుతున్న దాడులను ప్రజల్లోకి తీసుకువెళు తున్నాయి. దీంతో సొంత గూటికి చేరేవారి సంఖ్య పెరుగుతోంది. ఘర్ వాపసీలు ఇలాగే పెరిగితే తమ ఆదాయానికి, చర్చిల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతుందని కొందరు పాస్టర్లు భయాందోళనలు చెందుతున్నారు. ఆ కడుపుమంటతోనే ధర్మం గురించి ప్రశ్నించే హిందువులపైన దాడులను ప్రోత్సహిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజులను లక్ష్యంగా చేసుకోవ డానికి ప్రధాన కారణం ఇదేనని తెలుస్తోంది.

ప్రభుత్వ కఠిన హెచ్చరికలు
ఆకివీడు దారుణ ఘటనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో ఖండించారు. ఆలయ పునరుద్ధరణ కోసం వెళ్లిన ఉప సభాపతిపైన ఆయుధాలతో దాడి చేయడం గర్హనీయమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరెన్ని కుట్రలు చేసినా ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

అద్భుతమైన ఆలయ నిర్మాణం తథ్యం
ఈ పరిణామాల నేపథ్యంలో రఘురామకృష్ణ రాజు సంచలన ప్రకటన చేశారు. ప్రముఖ హిందూ సంస్థల పర్యవేక్షణలో, స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి నేతృత్వంలో ఆకివీడు రామాలయాన్ని అత్యంత భవ్యంగా పునర్నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఆగమ శాస్త్రం ప్రకారం, పూర్తిగా కృష్ణ శిలతో, కనీసం ఎనిమిది వందల సంవత్సరాల పాటు చెక్కుచెదర కుండా ఉండేలా ఈ ఆలయ నిర్మాణం త్వరలో చేపడతామని స్పష్టం చేశారు.

ఇది వివాదాస్పద స్థలం కాదు
ఈ దాడిని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ తీవ్రంగా తప్పుబట్టారు. ఇది వివాదాస్పద స్థలం కాదని, అక్కడ ఎప్పటి నుంచో రాముడి విగ్రహాలు ఉన్నాయని స్పష్టం చేశారు. మతం మారిన వ్యక్తులు గుడి నిర్మాణాన్ని అడ్డుకోవడం విచిత్రంగా ఉందన్నారు. మతం మారిన వారికి రిజర్వేషన్లు వర్తించవని సాక్షాత్తూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని గుర్తు చేశారు. ఆ మార్పిడి నుంచి వారు బయటకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎవరైనా మతం మారినంత మాత్రాన వందల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయాల సంస్కృతి, ప్రాముఖ్యత ఏమాత్రం చెరిగిపోవని తేల్చి చెప్పారు. స్థానిక హిందువుల కోరిక మేరకు విశ్వహిందూ పరిషత్ సహకారంతో ఆ ఆలయాన్ని అభివృద్ధి చేసి తీరుతామని, ఈ పవిత్ర కార్యంలో ప్రతి ఒక్కరూ కలసి రావాలని మంత్రి పిలుపునిచ్చారు.