News

అయోధ్య రాముడ్ని దర్శించుకొని, భావోద్వేగానికి లోనైన తేయాకు కార్మికులు

96views

అసోం తేయాకు తోటల కార్మికులు అయోధ్య రామాలయాన్ని సందర్శించుకున్నారు. ‘‘భారత్ దర్శన్ తీర్థ యాత్ర’’ పేరుతో అయోధ్య, కాశీ, సోమనాథ్, రామేశ్వరం దేవాయాల సందర్శన కోసం బయల్దేరారు. అయోధ్యలో రామాలయాన్ని సందర్శించడమే కాకుండా అయోధ్య నగరమంతా ఎంతో ఉత్సాహంగా సందర్శించారు. దిబ్రూగఢ్ లో వున్న మనోహరి టీ ఎస్టేట్‌లోని తేయాకు కార్మికులతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. తదనంతరం తీర్ధయాత్ర చేయాలని ఎస్టేట్ యాజమాన్యాన్ని ప్రోత్సహించారు. దీంతో ఎస్టేట్ యాజమాన్యం మరియు అశోక్ సింఘాల్ ఫౌండేషన్ సంయుక్తంగా కార్మికుల కోసం ఈ తీర్థయాత్రను రూపొందించారు.

మొదట 30 మంది కార్మికుల బృందంతో కర్సేవక్‌పురానికి చేరుకుంది. స్నానాలు ఆచరించి, ఇతర సంప్రదాయ క్రతువులను పూర్తి చేసుకున్న అనంతరం, వారందరూ సరయూ మాతకు మరియు నాగేశ్వర నాథునికి పూజలు నిర్వహించారు. తర్వాత వీణా చౌక్, రామ్ కీ పైడి ప్రాంతాలను సందర్శించారు. హనుమాన్ గర్హి, దశరథ మహల్, కనక భవన్ మరియు ఇతర పవిత్ర క్షేత్రాలను సందర్శించి, ఆధ్యాత్మిక అనుభూతికి లోనయ్యారు.

శ్రీరామ జన్మభూమి ఆలయానికి చేరుకున్న వెంటనే, అక్కడ ప్రదర్శితమవుతున్న కళా వైభవాన్ని చూసి తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మనస్ఫూర్తిగా దర్శించుకొని, ఆస్వాదించారు. తర్వాత ‘అంగద్ టిలా’ ప్రాంగణం నుండి ‘సీతా రసోయి’కి చేరుకున్నారు.

మరో వైపు ఈ సందర్భంగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ వీరందరికీ సామూహిక భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారందరికీ ‘‘రామ నామం’’ రాసి వున్న శాలువాలతో సత్కరించారు. తదనంతరం బాలరాముడి ప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా తీర్థ క్షేత్ర ట్రస్ట్ కి, తమకు సహకరించిన వారందరికీ తేయాకు కార్మికుల సంఘ ప్రతినిధులు ధన్యవాదాలు ప్రకటించారు.