
హిమాచల్ ప్రదేశ్ రాజధాని సిమ్లాలోని ప్రసిద్ధ శ్రీ రామ మందిర ప్రాంగణంలో ఒక ముస్లిం వివాహ వేడుక (నికాహ్) నిర్వహించేందుకు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెద్ద రాజకీయ, సామాజిక వివాదానికి దారితీసింది. స్థానిక గంజ్ బజార్‌లోని ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న కమ్యూనిటీ హాలును ముస్లిం కుటుంబానికి వివాహ వేడుక కోసం కేటాయించడంపై హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి.
ఏప్రిల్ లో జరగనున్న ఒక ముస్లిం వివాహ రిసెప్షన్ కోసం ఆలయ నిర్వహణ బాధ్యతలు చూస్తున్న ‘సూద్ సభ’ కమ్యూనిటీ హాలును బుక్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న హిందూ సంఘర్ష్ సమితి, విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పవిత్రమైన ఆలయ ప్రాంగణంలో అన్యమత వేడుకలు జరపడం హిందూ ధర్మ విరుద్ధమని వారు వాదిస్తున్నారు.
ఈ నిర్ణయానికి నిరసనగా హిందూ సంఘాల నాయకులు సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాహ వేడుకను వెంటనే రద్దు చేయాలని, లేనిపక్షంలో అదే రోజున ఆలయ వెలుపల ‘పందుల ఊరేగింపు’ నిర్వహిస్తామని హెచ్చరించారు. అంతేకాకుండా, నిరసన సూచికగా సామూహికంగా గుండు చేయించుకుంటామని (ముండన్) ప్రకటించారు. ఆలయ పవిత్రతను కాపాడటంలో కమిటీ విఫలమైందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివాదం ముదరడంతో సూద్ సభ అధ్యక్షుడు రాజీవ్ సూద్ స్పందించారు. గత ఐదేళ్లలో ఇలాంటి వివాహాలు దాదాపు 15 సార్లు జరిగాయని, అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడెందుకని ఆయన ప్రశ్నించారు. ఈ వేడుక జరిగేది కేవలం కమ్యూనిటీ హాలులో మాత్రమేనని, ప్రధాన ఆలయంలో కాదని స్పష్టం చేశారు. “మేము ఇప్పటికే సదరు కుటుంబం నుండి అఫిడవిట్ తీసుకున్నాము. అక్కడ ఎలాంటి నమాజ్ నిర్వహించకూడదని, మాంసాహారం లేదా మద్యం సరఫరా చేయకూడదని కచ్చితమైన నిబంధనలు విధించాము” అని ఆయన వివరించారు.
హిందూ సంఘాల హెచ్చరికలతో సిమ్లాలో ఉద్రిక్తత నెలకొంది. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు అప్రమత్తమయ్యారు. మరోవైపు, పెరుగుతున్న ఒత్తిడి నేపథ్యంలో ఈ బుకింగ్‌ను రద్దు చేయాలా వద్దా అనే అంశంపై చర్చించేందుకు సూద్ సభ అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆలయ కమిటీ తీసుకునే నిర్ణయంపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది.





