
50views
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణ ఎవరి కృపా కటాక్షాల వల్లనో జరగలేదని,అలాగే ఎవరి వ్యతిరేకత వల్ల కూడా సంఘ కార్యానికి ఆటంకం ఏర్పడలేదన్నారు. కేవలం స్వయంసేవకుల అవిశ్రాంత కృషి వల్లే సాధ్యమైందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ తేల్చిచెప్పారు. సంఘ్ ను తమదిగా భావిస్తూ, దాని ఆదర్శాలకు అనుగుణంగా దేశాన్ని తీర్చిదిద్దేందుకు తమ సర్వశక్తులనూ స్వయంసేవకులు ధారబోశారని, అలాంటి స్వయంసేవకుల వల్లే నేడు సంఘ్ దేశానికి దిశానిర్దేశం చేసే ఓ మార్గదర్శక శక్తిగా నిలబడగలిగిందని పేర్కొన్నారు.
నాగపూర్ లోని ఆరెస్సెస్ ప్రధాన కార్యాలయంలోని హెడ్గేవార్ స్మృతి మందిరంలో ‘‘రాష్ట్ర స్వరాధనా’’ అన్న పుస్తకావిష్కరణ సభలో మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ యేడాది సంఘ కార్యశతాబ్ది నడుస్తోందని, అయితే ఇది పండగలా కాకుండా ఆత్మ పరిశీలనకు ఓ అవకాశంగా చూస్తున్నామని, మన పూర్వీకులకు గుర్తు చేసుకుంూనే, మరింత ఉన్నత స్థితి వైపు పయనించేందుకు ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు.
తమ పూర్వ కార్యకర్తలు చేసిన పనిని సమీక్షిస్తూ, వారితో పోల్చుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం నేటి తరం స్వయంసేవకులపై వుందన్నారు. తమ పూర్వ కార్యకర్తలు చేసిన పనిని చక్కగా స్మరించుకోవడమే కాకుండా, వాటిని మరింత వేగంగా, ఉన్నత రూపంలో ముందుకు తీసుకెళ్లే బాధ్యత కూడా నేటితరం కార్యకర్తలపై వుందని నొక్కి చెప్పారు.
సంఘ్ చేసే కార్యక్రమాలన్నింటి వెనుక వున్న ఉద్దేశం సంస్కారాలు, విలువలను పెంపొందించడమే అని అన్నారు. దృఢమైన శరీరం, సంస్కారవంతమైన మనస్సుల ద్వారా ఉన్నత స్థాయి జీవనం దిశగా సాగడమే అంతిమ లక్ష్యమని వివరించారు. ఈ కోవలోనే ‘‘రాష్ట్ర స్వరాధన’’ అపారమైన ప్రాముఖ్యత కలిగి వుందని వివరించారు. సమయం గడిచిపోతుంది, పని కూడా ముందుకు సాగిపోతుందని, అయినా.. దాని ఆవిర్భావానికి కారణమైన ప్రాథమిక లక్షణాన్ని చివరి వరకూ నిలబెట్టుకోవడంలోనే అంతా వుందన్నారు.అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో సంఘ కార్యం ఎలా సాగిందో, ఏ ఉద్దేశంతో చేశామో.. దీనంతటినీ రాష్ట్ర స్వరాధనా అన్నపుస్తకం వివరిస్తుందని తెలిపారు.

స్వయంసేవకులు వృత్తిపరంగా గాయకులు కాకపోయినా, వాద్యకారులు కాకపోయినా.. తమ దైనందిన విధులను నిర్వర్తిస్తూనే, తమ ముందు కాగితం లేకుండానే సంగీత రచనను ప్రదర్శించడాన్ని చూసి, ప్రజలు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. అయితే.. అద్భుతాలు చేయడం సంఘ్ లక్ష్యం కాదని, అవి వాటంతటవే జరుగుతాయని స్పష్టం చేశారు. పూర్వ స్వయంసేవకుల సద్గుణాలన్నీ ఈ రచనల్లో కనిపిస్తాయని, వ్యక్తమవుతాయని అన్నారు.
ఓ కార్యకర్త సంపూర్ణమైన అంకిత భావంతో పనిచేసినప్పుడు మాత్రమే నిజమైన భావన బయటికి వికసిస్తుందని అన్నారు. శతాబ్దకాలంగా సాగిన సంఘ ప్రస్థానానికి సంబంధించిన ఘనత ప్రజలకు, దేశానికి మాత్రమే చెందుతుందని, సంఘ్ పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకోవడం తమ లక్ష్యం కాదని తేల్చి చెప్పారు.





