
అనేక సంవత్సరాలుగా నక్సలిజానికి చిరునామాగా ఉన్న ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా ఇప్పుడు పూర్తిగా మావోయిస్టుల ప్రభావం నుంచి విముక్తి పొందింది. మంగళవారం ఇద్దరు కీలక మహిళా నక్సలైట్లు లొంగిపోవడంతో జిల్లాను ‘మావోయిస్టు రహిత జిల్లాగా సుక్మా ఎస్పీ కిరణ్ జీ చవాన్ అధికారికంగా ప్రకటించారు. లొంగిపోయిన ఈ ఇద్దరు మహిళలు నక్సలైట్ సంస్థలోని ‘కంపెనీ నంబర్ 8’లో సభ్యులుగా ఉండేవారని, వీరిద్దరిపై కలిపి రూ. 16 లక్షల రివార్డు ఉందని ఆయన వెల్లడించారు. వీరి నుంచి ఒక ఇన్సాస్ (INSAS) ఎల్ ఎంజీ, రెండు ఏకే-47 లు సహా మొత్తం 6 ఆటోమేటిక్ ఆయుధాలు, రూ. 10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండేళ్ల నిరంతర పోరాటం.. 800 మంది లొంగుబాటు
గత రెండేళ్లుగా భద్రతా దళాలు మారుమూల అటవీ ప్రాంతాల్లో చేపట్టిన సుస్థిర ఆపరేషన్లే ఈ విజయానికి కారణమని ఎస్పీ తెలిపారు. ఈ కాలంలో 90 మందికి పైగా నక్సలైట్లు మరణించగా, 600 మందిని అరెస్టు చేశారు. అలాగే వందలాది మంది నక్సలైట్లు స్వచ్ఛందంగా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశారు. అటవీ అంతర్భాగాల్లో కొత్తగా పోలీస్ క్యాంపుల ఏర్పాటు వల్ల నక్సలైట్ల ప్రాబల్యం పూర్తిగా తగ్గిపోయిందని, ప్రస్తుతం జిల్లాలో సుమారు 60 రోడ్ల నిర్మాణ పనులు, పలు అభివృద్ధి ప్రాజెక్టులు వేగంగా సాగుతున్నాయని ఎస్పీ చవాన్ పేర్కొన్నారు. ముఖ్యంగా క్రీడల ద్వారా యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకువస్తున్నట్లు ఆయన వివరించారు.
మరోవైపు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లోక్‌సభలో మాట్లాడుతూ.. బస్తర్ రీజియన్‌లో నక్సలిజం దాదాపు తుడిచిపెట్టుకుపోయిందని హర్షం వ్యక్తం చేశారు. గతంలో రక్తపాతంతో నిండిన ఈ ప్రాంతం ఇప్పుడు అభివృద్ధి పథంలో పయనిస్తోందని అన్నారు. బస్తర్‌లోని ప్రతి గ్రామంలో పాఠశాలలు, రేషన్ షాపులు ఏర్పాటు చేయడంతో పాటు, ప్రతి పంచాయతీలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను (PHC) నిర్మించామని తెలిపారు. ప్రజలందరికీ ఆధార్ మరియు రేషన్ కార్డులు అందజేసి, నెలకు 5 కిలోల ఆహార ధాన్యాలను ప్రభుత్వం అందిస్తోందని, తద్వారా వారు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను పొందుతున్నారని ఆయన స్పష్టం చేశారు.





