News

తొమ్మిది మంది చిన్నారులకు ‘కన్యాపూజ’ నిర్వహించిన సీఎం యోగి

94views

శ్రీరామనవమి, చైత్ర నవరాత్రి ముగింపు పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్ లోని గోరఖ్‌నాథ్ ఆలయంలో ఘనంగా ‘కన్యాపూజ’ నిర్వహించారు. తొమ్మిది మంది చిన్నారులను దుర్గాదేవి రూపాలుగా భావించి, వారికి పాదపూజ చేసి స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆధ్యాత్మిక పరిపూర్ణత, శ్రేయస్సు కలగాలని ఆకాంక్షించారు. కన్యాపూజ అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. “దుర్గామాతకు అంకితం చేసిన తొమ్మిది రోజుల నవరాత్రి ఉత్సవాలు నేటితో పూర్తవుతున్నాయి. నవరాత్రి తొమ్మిదో రోజు అన్ని రకాల ఆధ్యాత్మిక ప్రయోజనాలను, సంతోషాన్ని, సంపదను ప్రసాదించే పవిత్రమైన రోజు. మాతృదేవత ఆశీస్సులు ప్రజలందరిపై ఉండి, వారి జీవితాలు ఆనందంతో నిండాలని కోరుకుంటున్నాను” అని పేర్కొన్నారు. అలాగే శ్రీరామనవమి ప్రాముఖ్యతను వివరిస్తూ, సనాతన ధర్మ సంప్రదాయంలో శ్రీరాముడు భారతీయులందరికీ స్ఫూర్తిదాయకమైన వ్యక్తి అని కొనియాడారు.

ప్రత్యేక ఆకర్షణగా ‘బొమ్మ బుల్డోజర్’
ఈ వేడుకలో ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. యశస్విని అనే చిన్నారి ముఖ్యమంత్రి యోగికి ఒక ‘బొమ్మ బుల్డోజర్’ను బహుమతిగా ఇచ్చింది. ఆ బహుమతిని చూసి ముసిముసి నవ్వులు చిందించిన సీఎం, ఆ పాపను ప్రేమగా దగ్గరకు తీసుకుని “దీనితో ఆడుకో.. బాగా చదువుకో” అని దీవించారు. ఆ బహుమతి ఎందుకు ఇచ్చావని అడగ్గా.. “బుల్డోజర్ అంటే ఆయనకు ఇష్టమని అందుకే ఇచ్చాను” అని ఆ చిన్నారి అమాయకంగా సమాధానం ఇచ్చింది. దేశవ్యాప్తంగా చైత్ర నవరాత్రులు, శ్రీరామనవమి వేడుకలు అత్యంత భక్తిశ్రద్ధలతో సాగాయి. తొమ్మిది రోజుల పాటు సాత్విక ఆహారం తీసుకుంటూ ఉపవాస దీక్షలు చేపట్టిన భక్తులు, నేడు రామాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా అయోధ్యలో శ్రీరాముని జన్మదిన వేడుకలు అంబరాన్నంటాయి. శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని వివిధ రూపాల్లో కొలుస్తూ సాగిన ఈ ఉత్సవాలు ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపాయి.