
కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి గుడికి కొత్తగా కోనేరు నిర్మించాలని ఆలయ పాలకమండలి నిర్ణయించింది. ఈ ఆలయానికి మూడు వైపులా మాడవీధులు విశాలంగా ఉన్నా, ముందువైపు పుష్కరిణి కారణంగా బ్రహ్మోత్సవాల వేళ వాహన సేవలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ పుష్కరిణిని పూడ్చివేసి, సమీపంలోనే సుపథ మండపానికి 60 అడుగుల దూరంలో మరిన్ని హంగులతో నూతన సరోవరాన్ని రూ.3.40 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. అక్కడున్న భవనాలను తొలగించనున్నారు. ఈ పనులకు దేవాదాయశాఖ అనుమతి లభించింది. కొత్త పుష్కరిణికి ఈ నెలాఖరులోపు టెండర్లు పిలిచి, వెంటనే పనులు ప్రారంభిస్తామని, ఈ ఏడాది బ్రహ్మోత్సవాల నాటికి అందుబాటులోకి తెస్తామని ఆలయ పాలకమండలి ఛైర్మన్ ఎం.మణినాయుడు, ఈవో పెంచల కిశోర్ తెలిపారు.
అవే రాళ్లు.. అవే కొలతలు
ప్రస్తుత పుష్కరిణి 140 అడుగుల పొడవు, 140 అడుగుల వెడల్పు, 12 అడుగుల లోతుతో ఉంది. కొత్త పుష్కరిణిని కూడా ఇవే కొలతలతో నిర్మించాలని ఆలయ ఇంజినీరింగ్ విభాగం అధికారులు ప్రణాళిక రూపొందించారు. ఇందుకు ప్రస్తుత పుష్కరిణిలోని రాళ్లను వాడుకోవడంతో పాటు కొత్తగా మరిన్ని హంగులు అద్దనున్నారు. చుట్టూరా శిల్ప కళ ఉట్టిపడేలా పాత ఆలయానికి సంబంధించిన రాతి స్తంభాలను వినియోగిస్తారు. కోనేరు మధ్యలో రాతి నీరాజన మండపాన్ని నిర్మించి, అందులో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తారు. పుష్కరిణిలోకి దిగేందుకు నలువైపులా ద్వారాలు, బారికేడ్లు నిర్మిస్తారు. నీరు ఎల్లప్పుడూ శుద్ధిగా ఉండేలా యంత్రాలు ఏర్పాటు చేస్తారు. కోనేటి చుట్టూ రాత్రివేళ కాంతులు విరజిమ్మేలా విద్యుత్ దీపాలంకరణ చేస్తారు.





