News

ఆంధ్రప్రదేశ్ లో 2,727 సంఘ శతాబ్ది కార్యక్రమాలు

325views

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ – అఖిల భారత ప్రతినిధి సభ ఈ సంవత్సరం హర్యానా ప్రాంతంలోని సమల్కా లో ఈ నెల అనగా మార్చి 13 న ప్రారంభమై 15వ తేదిన ముగిసినది. ఈ సమావేశానికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి 1493 మందికి గాను 1438 పాల్గొన్నారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రాంతం నుంచి 100% ఉపస్థితి ఉంది.

అఖిల భారత ప్రతినిధి సభ  వివరాలను ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ సహ సంఘచాలకులు శ్రీ సుంకవల్లి రామకృష్ణ గారు మరియు ఆర్ఎస్ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రచార ప్రముఖ్ బయ్యా శ్రీనివాసులు 17వ తేదీ విజయవాడలో  జరిగిన పత్రిక విలేఖరుల సమావేశంలో తెలిపారు.

అఖిల భారతీయ ప్రతినిధి సభలో సర్ కార్యవాహ్ మాననీయ దత్తాత్రేయ హోసబాలే జీ వార్షిక నివేదిక (2025–26) సమర్పణ:

అఖిల భారతీయ ప్రతినిధి సభ సమావేశంలో సర్ కార్యవాహ్ వార్షిక నివేదిక (2025–26) సమర్పించారు. ఈ నివేదికలో సంఘ కార్య విస్తరణ, శతాబ్ది సంవత్సర కార్యక్రమాలు, సమాజోన్ముఖ కార్యక్రమాలు మరియు దేశవ్యాప్తంగా జరుగుతున్న వివిధ కార్యాలపై సమగ్ర సమీక్ష చేయబడింది.

నివేదిక ప్రకారం గత సంవత్సరంలో సంఘ్ కార్యం దేశవ్యాప్తంగా గణనీయంగా విస్తరించింది. దేశవ్యాప్తంగా 88,949కు పైగా రోజువారీ శాఖలు, 32,606 కు పైగా సాప్తాహిక మిలన్లు మరియు 13,211 కు పైగా మాసిక మండళ్లు నిర్వహించ- బడుతున్నాయి. మొత్తం మీద 1.34 లక్షలకు పైగా కార్య కేంద్రాలలో సంఘ్ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మన ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో 1746కు పైగా రోజువారీ శాఖలు, 930కు పైగా సాప్తాహిక మిలన్లు మరియు 382 కు పైగా మాసిక మండళ్లు నిర్వహించబడుతున్నాయి. మొత్తం మీద 3,058 కి పైగా కార్య కేంద్రాలలో సంఘ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

పరమపూజనీయ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారు దేశంలోని అనేక ప్రాంతాలకు పర్యటించి స్వయంసేవకులు మరియు సమాజ ప్రముఖులతో సమావేశమయ్యారు. ఉదాహరణకు నాగపూర్, కోల్కతా, డెహ్రాడూన్ వంటి నగరాలలో జరిగిన సమావేశాలలో సమాజ ఐక్యత, కుటుంబ వ్యవస్థ బలోపేతం మరియు భారతీయ సంస్కృతి పరిరక్షణపై ఆయన సందేశం ఇచ్చారు.

అదే విధంగా ఈ సంవత్సరం (2026) జనవరి 29, 30 వ తేదీలలో రెండు రోజులపాటు పరమపూజనీయ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ గారు మన ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ రంగాల ప్రముఖులతో సమావేశంలో పాల్గొనటం జరిగింది.

అలాగే సర్ కార్యవాహ్ దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించారు. సంఘ కార్య విస్తరణ మరియు శతాబ్ది సంవత్సర కార్యక్రమాలపై మార్గదర్శనం చేశారు. ఇండోర్, మీరట్ వంటి ప్రాంతాలలో కార్యకర్తల సమావేశాలు నిర్వహించబడ్డాయి. మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం లో వారు పర్యటించారు. అక్కడ వివిధ కార్యక్రమాలలో పాల్గొన్నారు.

సంఘ శతాబ్ది సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా విస్తృత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. వాటిలో ముఖ్యంగా విజయదశమి ఉత్సవాలు, గృహ సంపర్క అభియాన్ పెద్ద ఎత్తున జరిగాయి. సామాజిక సద్భావనా సమావేశాలు, ప్రముఖ వ్యక్తుల సమావేశాలు మరియు యువ కార్యక్రమాలు వంటి కార్యక్రమాలు దేశంలోని అనేక నగరాలు మరియు గ్రామాలలో లో పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్నాయి.

సంఘ శతాబ్ది సంధర్భంగా మన ఆంధ్రప్రదేశ్ లో 2025 అక్టోబర్ లో ఆంధ్రప్రదేశ్ అంతటా విజయదశమి ఉత్సవాలు జరిగాయి. మొత్తం 1,834 ఉప మండలాలకి గాను 1,752 మండలాల్లో 973 బస్తీలలకుగాను 947 బస్తీలలో మొత్తం 2,807 స్థలాలకు గాను 2699 స్థలాల్లో 2,727 కార్యక్రమాలు జరిగాయి. అలాగే 2025 నవంబర్ మరియు డిసెంబర్ మాసాలలో గృహ సంపర్క అభియాన్ చేశారు. ఇంటి ఇంటికీ వెళ్ళి పంచ పరివర్తన విషయాలని 62000 మంది సంఘ స్వయంసేవకులు ప్రచారం చేశారు. ఈ సంవత్సరం జనవరి నెలలో ఆంధ్రప్రదేశ్ అంతటా 2200 స్థలాల్లో ప్రతీ మండలం మరియు బస్తీలో హిందూ సమ్మేళనాలు నిర్వహించడం జరిగింది. ఈ సమ్మేళనాలలో సుమారుగా 12 లక్షల మంది హిందూ బంధువులు, పూజ్య స్వామీజీలు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.

ఈ అఖిల భారత ప్రతినిధి సభలో సంఘ విస్తరణ మరింత వేగవంతం చేయటానికి ప్రస్తుతం 11 క్షేత్రాలు 46 ప్రాంతాలుగా ఉన్న భారత దేశ భౌగో క వ్యవస్థని 2027 మార్చి నుంచి 9 క్షేత్రాలు 85 సంభాగ్ లుగా పునర్వ్యవస్థీకరణ చేయాలని నిర్ణయించారు. మన ఆంధ్రప్రదేశలో 2 సంభాగ్ లు ఏర్పరచాలని నిర్ణయించారు.

సంఘ కార్యంలో శిక్షణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉన్న నేపథ్యంలో గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా అనేక శిక్షావర్గలు (శిక్షణా శిబిరాలు) నిర్వహించబడ్డాయి. ఈ శిక్షణా శిబిరాలలో 2025 26 సంవత్సరంలో 2,43,405 మంది కార్యకర్తలు పాల్గొని శారీరక మరియు బౌద్ధిక శిక్షణ పొందారు.

దేశవ్యాప్తంగా భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి. వందేమాతరం గీతం 150వ వార్షికోత్సవం, శ్రీ గురు తేగ్ బహదూర్ సింగ్ 350వ బలిదాన సంవత్సరం, సంత్ రవిదాస్ జీ 650వ జయంతి వంటి జాతీయ స్మారక సందర్భాలను పురస్కరించుకుని సమావేశాలు, గోష్టులు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి.

సేవా విభాగం ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా 55,958 సేవ, 45, 931 విద్య, 15,632 ఆరోగ్యం మరియు 17,888 సామాజిక రంగాలలో మొత్తం 1,35,409 సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. ప్రచార విభాగం ద్వారా సంఘ కార్యం మరియు జాతీయ అంశాలపై సమాచారం సమాజానికి చేరవేయడానికి వివిధ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సంపర్క విభాగం ద్వారా సమాజంలోని ప్రముఖులు మరియు వివిధ రంగాల వ్యక్తులతో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతున్నాయి.

అదే విధంగా గో సేవ కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు, కుటుంబ ప్రబోధన్, స్వదేశీ స్వావలంబన, పౌర విధులు మరియు సామాజిక సమరసత వంటి సమాజ పరివర్తనకు ఉద్దేశించిన కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించబడుతున్నాయి.

సంఘ కార్యంపై సమాజం చూపిస్తున్న విశ్వాసం పెరుగుతున్న నేపథ్యంలో స్వయంసేవకులు మరింత బాధ్యతతో సమాజ సేవలో పాల్గొనాలని అఖిల భారత ప్రతినిధి సభ పిలుపునిచ్చింది. సంఘ శతాబ్ది సంవత్సరాన్ని సమాజ ఐక్యత, సామరస్యం మరియు జాతీయ చైతన్యం బలోపేతానికి ఉపయోగించుకోవాలని సూచించింది.