News

రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యం

145views

అనంతపురం జిల్లా ఉరవకొండ రాకెట్ల గ్రామంలో రాయల కాలం నాటి తామ్ర శాసనాలు లభ్యమయ్యాయి. తూమటి సుధాకర్‌ ఇంట్లో మూడు తామ్రపత్రాలను పురావస్తు శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని అక్కడి నుంచే మైసూరులోని భారత పురావస్తు శాఖ శాసన విభాగం డైరెక్టర్‌ మునిరత్నంకు పంపించారు.

తామ్రపత్రాల గురించి చరిత్రకారుడు బుక్కపట్నం గోపి మీడియాకు వివరాలు వెల్లడించారు. విజయనగర సామ్రాజ్యాధీశుడు శ్రీకృష్ణదేవరాయులు రాయించిన శాసనాలుగా శాసనవిభాగం డైరెక్టర్‌ గుర్తించినట్లు తెలిపారు. వీటిని క్రీ.శ.1527 నవంబర్‌ 5న కార్తీక సోమవారం రోజున తెలుగు, సంస్కృత భాషల్లో రాయించారని పేర్కొన్నారు. ఇందులో శ్రీకృష్ణదేవరాయల ఘనత, యుద్ధవిజయాలు, నాటి శాసనాలు, ఇచ్చిన కానుకల గురించి వివరిస్తున్నాయని తెలిపారు. దీంతో పాటు మహభాష్యకారుడు, యజుర్వేద పండితులు చెన్న భట్టార్యులకు కృష్ణదేవరాయలు కడప జిల్లా రాజుపాలెం మండలం దద్దనాల గ్రామాన్ని అగ్రహరంగా ఇచ్చినట్లు శాసనాల్లో లిఖించారని పేర్కొన్నారు. జిల్లాలో శ్రీకృష్ణదేవరాయల శాసనాలు 30 వరకు గుర్తించినట్లు తెలిపారు. తాజాగా రాకెట్లలో వెలుగు చూసిన శాసనాలతో అనంతపురంలో శ్రీకృష్ణదేవారాయల సామ్రాజ్య ప్రభావం ఎంతో కీలకంగా ఉందని స్పష్టం అవుతోందన్నారు