ArticlesNews

“మాతృత్వం” పేరిట గర్భిణులకు పౌష్టికాహారం అందజేత

174views

సోషల్ మీడియా అనేది కేవలం వినోదానికి మాత్రమే కాదు. సేవకు కూడా మార్గమని ఓ ఫేస్​బుక్ గ్రూప్ సభ్యులు నిరూపిస్తున్నారు. తమ వంతుగా స్వస్థలానికి తోడ్పడాలనే ఉద్దేశంతో కొన్ని సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేపడుతూ ఆదర్శంగా నిలుసున్నారు. దేశం మన దేహమైతే ఊరు మా ఊపిరి. ఈ నినాదంతో “మన పెద్దాపురం” పేరిట ఫేస్ బుక్ గ్రూపు సభ్యులు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. మాతృత్వం పేరిట గర్భిణులకు పౌష్టికాహారం ఇవ్వటం సహా రక్తదానం, స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పని చేస్తున్నారు. వంద వారాలుగా నిరంతరాయంగా సాగుతున్న పెద్దాపురం యువత సామాజిక సేవపై ప్రత్యేక కథనం.

దాతృత్వం ఆత్మశుద్ధికి మార్గమని నమ్మిన “మన పెద్దాపురం” ఫేస్ బుక్ గ్రూపు సభ్యులు వివిధ రకాలుగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 10 ఏళ్ల క్రితం స్థానిక యువత ఫేస్‌బుక్‌ గ్రూప్‌ ప్రారంభించారు. ఇప్పటికి 32,000 మంది పైగా గ్రూపు సభ్యులు ఉన్నారు.

నిరంతరాయంగా సామాజిక సేవా కార్యక్రమాలు: దశాబ్ద కాలంలో వీరంతా దాతల సాయంతో రక్తదానం, అవయవదానం, పరిసరాల పరిశుభ్రత, పేద విద్యార్థుల చదువులకు ఆర్థికసాయం, అనారోగ్య పీడితులకు వైద్య ఖర్చులు ఇలా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పెద్దాపురం సామాజిక ప్రభుత్వాసుపత్రికి ప్రతి బుధవారం వైద్య పరీక్షల కోసం వచ్చే గర్భిణులు భోజనం కోసం ఇబ్బందులు పడటాన్ని గుర్తించి వారికి 15 రకాల పదార్థాలతో పౌష్టికాహారాన్ని అందిస్తున్నారు.

కాబోయే తల్లులకు 15 రకాలతో పౌష్టికాహారం: కాబోయే తల్లులకు పౌష్టికాహారం ఎంతో అవసరం. పేద కుటుంబాలకు చెందిన వారు అందుకు అయ్యే వ్యయం విషయంలో తర్జన భర్జన పడుతుంటారు. ఇలాంటి వారికి ఈ గ్రూపు అండగా నిలుస్తోంది. “మన పెద్దాపురం” ఫేస్ బుక్ గ్రూపు ఆధ్వర్యంలో పౌష్టికాహారంలో డ్రై ఫ్రూట్స్‌తో పాటు పప్పు ఉండలు, గుడ్లు, రాజ్​మా, వివిధ రకాల కూరలు, చికెన్, పళ్లు ఇలా 15 రకాల పదార్థాలు అందిస్తున్నారు. గర్భిణులతో పాటు వచ్చే సహాయకులు కలిపి సుమారు 200 మంది వరకు కూడా ఆసుపత్రి ప్రాంగణంలోనే భోజనం చేసి ఇంటికి చేరుతుంటారు. మానవసేవే మాధవసేవ నినాదంతో సేవా కార్యక్రమాలు చేపట్టినట్లు గ్రూపు సభ్యులు చెబుతున్నారు.

పచ్చదనం, పరిశుభ్రత కోసం తపిస్తున్న యువత: పర్యావరణ హితం కోసం కూడా “మన పెద్దాపురం” ఫేస్​బుక్ సభ్యులు పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. పురపాలిక పరిధిలోని 700 గజాల సామాజిక స్థలంలో టైనీ అర్బన్ ఫారెస్ట్‌ కూడా పెంచుతున్నారు. తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలు, దట్టంగా పెరిగేలా సంవత్సరం కిందట నాటారు. బిందు, తుంపర పరికరాలతో నీటి సదుపాయం కల్పించారు. చుట్టూ ప్రహరీ నిర్మించారు. మొక్కలన్నీ పెరగడంతో ఆ ప్రాంతం చిట్టడవినే తలపిస్తోంది.