News

భక్తుల పథం.. ధర్మరథం

99views

తిరుమలలో భక్తుల సౌకర్యార్థం టిటిడి నిర్వహిస్తున్న శ్రీవారి ధర్మరథాలు ప్రజాదరణ పొందుతున్నాయి. బస్సులు వచ్చే సమయాన్ని తెలిపేలా డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయడంతో వేచిచూసే సమయం తగ్గి ఉచిత సేవలను విస్తృతంగా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం తిరుమలలో 12 అత్యాధునిక ఎలక్ట్రిక్‌ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఇవి రోజుకు సగటున 300 ట్రిప్పులు, ఒక్కో ట్రిప్పునకు సుమారు 6.5 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తున్నాయి. ఈ విధానం దేశంలోని ప్రముఖ ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాల్లో భక్తుల కోసం ప్రత్యక్ష బస్సు సమాచారం అందించే తొలి సాంకేతిక ప్రయోగంగా నిలుస్తోంది.

ధర్మరథం బస్సులు, ఎలక్ట్రిక్‌ బస్సుల సంఖ్య పెరగడంతో స్థానికంగా ప్రైవేటు బస్సులు, జీపులు వినియోగించేవారు తగ్గారు. తిరుమలలోని 20 బస్టాపుల్లో డిజిటల్‌ బోర్డులు ఏర్పాటు చేయగా హైదరాబాద్‌కు చెందిన బి.ఎస్‌.టెక్నోట్రానిక్స్‌ ప్రైవేట్ లిమిటెడ్‌ సంస్థ వాటిని విరాళంగా ఇచ్చింది. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ లిమిటెడ్‌ సంస్థ సాంకేతిక సహకారం అందిస్తోంది. ఈ విధానంలో పది నిమిషాల్లోనే బస్సులు వస్తున్నాయి. ఇంధన వినియోగం తగ్గించడంతోపాటు కాలుష్య నియంత్రణకు, తిరుమలలో ప్రజారవాణా వ్యవస్థను బలోపేతానికి తితిదే కృషిచేస్తోంది.

భక్తుల కోసం ప్రస్తుతం రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకు ఎలక్ట్రిక్‌ బస్సులు 60 ట్రిప్పుల వరకు తిప్పుతున్నారు. ఆదరణ నేపథ్యంలో ఆర్టీసీ తో కలిపి అదనంగా ట్రిప్పులు పెంచనున్నారు. ప్రతిరోజూ వేలమంది ఉచిత బస్సు సేవలను వినియోగించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని బస్సులు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.