
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయ్యాయి. సంఘ కార్య శతాబ్ది పేరుతో సంఘ్ యేడాది పొడవునా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అలాగే అనేక మంది యువత, ప్రముఖులు, ఇతరులు ఇప్పుడు సంఘ్ పట్ల ఆకర్షితులవుతున్నారు. అయితే… వంద సంవత్సరాలు గడచినా.. సంఘ్ నిత్య నూతనంగా, అంతే సైద్ధాంతిక నిబద్ధతతో ముందుకు సాగుతోంది. ఇప్పటికీ సంఘ్ లో వ్యక్తి పూజ లేదు. కేవలం భగవా ధ్వజాన్ని గురువుగా స్వీకరిస్తూ ముందుకు సాగుతోంది. అయితే.. అసలు సంఘ్ రహస్యం అంతా ఎందులో వుంది? సంఘ్ లో వుందా? సిద్ధాంతంలో వుందా? ప్రచారక్ అనే వ్యవస్థలో వుందా? అన్నది కొందరి మెదళ్లలో ఇప్పటికీ నానుతోంది. మరి సంఘ రహస్యం ఎందులో వుంది? అంటే దీనికి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ రెండో సర సంఘచాలక్ (రెండో ఆరెస్సెస్ చీఫ్) గురూజీ అప్పట్లో నాగపూర్ కేంద్రంగా జరిగిన ‘‘ధ్యేయ దర్శనం’’ పేరుతో ఉపన్యాసమిచ్చారు.
సంఘ కార్య రహస్యం అంతా ‘‘కబడ్డీ’’ ఆటలోనే వుందని గురూజీ తేల్చి చెప్పారు. దీనిపై గురూజీ మాట్లలోనే చూద్దాం.
మనం మన కార్యం యొక్క అవసరంతో పాటు మన కార్యక్రమాల ఉపయోగాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మన కార్యం 1925 లో ప్రారంభించబడిన అన్ని రకాల వ్యతిరేకతను, దుష్ప్రచారన్ని ఎదుర్కొంటూ కూడా ముందుకు సాగింది. ప్రజలు మన కార్యకర్తలను చూచి కార్యకర్త గుణవంతుడు, విద్యావంతుడై, అలసట లేకుండా, కష్టాలను సహిస్తూ, కుటుంబ జీవనాన్ని త్యజించి పనిచేయగలడని, స్వార్థంలో మునిగిపోకుండా, హిందూ సంస్కృతి బోధించిన ప్రకారం త్యాగమయ జీవితాన్ని గడుపుతూ పనిచేస్తారని అర్థం చేసుకున్నారు. నిస్వార్థ జీవనం ప్రత్యక్షాచరణలో ఎలా వుంటుందో మన దగ్గర కనబడుతుంది. సమాజంపైన భయంకరమైన ఆఘాతాలు తటస్థపడ్డప్పుడు కూడా స్వయంసేవకులు సమాజాన్ని రక్షించారు. సమాజ రక్షణలో చాలా మంది స్వయంసేవకులు ప్రాణాలను కూడా అర్పించారు.
నేను పంజాబ్ వెళ్లినప్పుడు స్వయంసేవకుల ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని చాలా మంది ప్రశంసించారు. చంపడం, చావడం, ఈ రెండింటి శిక్షణ పొందిన సైనికులు వెళ్లడానికి భయపడే స్థలానికి స్వయంసేవకులు వెళ్లగలిగారు. ఏ ప్రేరణతో వెళ్లగలిగారు, దాని రహస్యమేమిటో చెప్పండని ఓ సైనికాధికారి అడిగాడు. అందుకు నేను ‘‘ఎలాంటి శిక్షణా లేదు, కేవలం ఆటలు ఆడుతారు’’ అని అన్నాను. మన ఈ కార్యం ద్వారా నిర్మితమైన నిస్వార్థ పరాక్రమ వంతమైన అంత:కరణ సమాజం యొక్క దుస్థితిని చూసి బాధపడుతుంది. ఆ బాధతోనే సంఘ స్వయంసేవకులు ఇంత ధైర్యాన్ని, పరాక్రమాన్ని చూపించగలిగారు.
ఇదంతా ఎలా చేయగలిగారు. పెద్ద గ్రంథాలు చదివా? లేక వాదోపవాదాల వల్ల? మన కార్యంలో రెండు రహస్యలున్నాయి. ఒకటి మన కార్యంలో రహస్యం లేకపోవడం. రెండోది ‘‘కబడ్డీ’’. ఈనాడు కూడా కార్యక్రమంలో ఆ గుణం వుంది. క్రింద భూమి, పైన భగవంతుడు సృష్టించిన ఆకాశం నలుదిక్కుల వ్యాపించి యున్న విశాల హిందూ సమాజం – వీటి ఆధారంగా జరిగే ఈ కబడ్డీ ఎంతో ప్రాముఖ్యమైంది. ఇదే స్వయంసేవక్ కి లభించిన ఆధ్యాత్మిక అధిష్ఠానం. ఒకచోట పనిచేయడానికి ఒక స్వయంసేవక్ వెళ్లాడు. అతడు ఎక్కువగా చదువుకున్నవాడు కాదు. అతనికి నేను హిందువును, ఇది నా మాతృభూమి, మా ఇద్దరిది విడదీయరాని అనుబంధమని సమాజంలో ఆత్మీయతను, ప్రేమకు జాగృతపరచి సమాజ క్షేమం గురించి ఆలోచించడమే తన కర్తవ్యమనే సంఘకార్యం యొక్క మౌలిక సిద్ధాంతం ఆయనకు తెలుసు. ఆయన దగ్గరికి ఒక వ్యక్తి వెళ్లి మొదట మాతో చర్చించు. ఆ తర్వాత మేము పనిచేస్తామని అన్నాడు. ఆ కార్యకర్త ఆయనతో చర్చకు దిగేంత పండితుడు కాదు. అందుచేత ఆ స్వయంసేవక్ అతనితో ‘‘మీరు నాతో ఒక నెల వరకు కబడ్డీ ఆడండి. ఆ తర్వాత నేను మీతో చర్చిస్తాను’’ అన్నాడు. కబడ్డీ ఆడాడు. అతనితో ప్రేమ ఏర్పడ్డది. ’’చర్చ‘‘ గురించి మరిచిపోయాడు. ఇది మన అనుభవం. దీనిని మనం వదులుకోలేము.
మన యశస్సుకు, మన పేరు ప్రఖ్యాతులకు కారణం మన కబడ్డీ ఆటే. కబడ్డీ లోంచి పుట్టిన శక్తి వల్లనే పంజాబ్ విభజన సమయంలో లక్షలాది మంది ప్రాణాలు రక్షించబడ్డాయి. మర్యాద, ఆస్తులు రక్షించబడ్డాయి. ఆ రోజులలో నేను అక్కడికి వెళ్లాను. శాంతిని స్థాపిస్తామని ప్రతిజ్ఞ చేసిన వారు అక్కడికి వెళ్లలేదు. మిగతా వాళ్లు అక్కడ ఉండలేకపోయారు. ఇలాంటి సమయంలో స్వయంసేవకులే ప్రజలను కాపాడారు. అన్నార్తులకు అన్నం పెట్టారు. నిరాశ్రయులకు ఆశ్రయం కల్పించి సేవచేశారు.
ఒకసారి ఇదే విషయం మీద ఒక మిత్రుడు చర్చించాడు. సంస్థ కోసం మనుషులు, ధనం మరియు ఆయుధాలు కావాలని అన్నాడు. నేను సరే మంచిది నీ మాట నేను ఒప్పుకుంటాను. కానీ అవి నీవు చెప్పిన వరుస క్రమంలోనే కావాలి అని అన్నాను. కేవలం ఆయుధాలు లేదా ధనంతో ఏమి లాభం? మొదట మనిషి కావాలి. దానిని మొదట మనం పూరించాలి. ఇదే మన పని.మొదట మనిషి కావాలి. ఆ తర్వాత మిగతా ప్రణాళికలు, పనులు ఒకచోట ఒక పెద్ద మనిషి మూసివేసిన కవరును డాక్టర్జీకి ఇస్తూ ఇందులో 500 రూపాయలున్నవి. అవి నేను చాలా భక్తి శ్రద్ధలతో ఇస్తున్నాను, అన్నాడు. వెంటనే ‘‘డాక్టర్జీ’’ నేను శ్రద్ధాభక్తులతో ఇచ్చిన ’’మనిషి‘‘ ని దానంగా తీసుకుంటాను. రూపాయలను కాదు. దేశం కోసం మనిషి కావాలి. రెండు కాళ్లున్న వాడు కాదు, ప్రఖర దేశభక్తి గలవాడు కావాలి, సంపూర్ణ మనిషి’’ కావాలి అన్నాడు. తర్వాత డాక్టర్జీ చాలా గౌరవ మర్యాదలతో ఆ డబ్బులను తిరిగి ఇచ్చాడు. అంటే చివరకు మనిషే ప్రధానం మిగతా విషయాలు అంత ప్రధానం కాదు. అందుచేత మనం మనుషులను కలుపాలి. ఇంత పెద్ద పని కబడ్డీ ద్వారానే జరుగుతున్నది. ఇదే మన కార్యానికి ఆధారం.
ఇంత వరకు మన మింకేమైనా చేశామా? కేవలం కబడ్డే ఆడాము. ఇతర సంస్థలు తమ ముందు పెద్ద పెద్ద కార్యక్రమాలు పెట్టుకున్నాయి. ప్రణాళికలు తయారయ్యాయి. ఆ ప్రణాళికలను పూర్తి చేసే ప్రయత్నాలు కూడా కనబడ్డాయి. కానీ అలాంటి వాళ్లలో స్వార్థం, ద్వేషం, మానావమానాలు లాంటి చెడుగుణాలు ఎందుకు ఏర్పడ్డాయి? సంఘంలోని ఏ స్వయంసేవకైనా ఇలాంటి దుర్గుణాలకుతన హృదయంలో స్థానమివ్వడు, మాతృభూమి యొక్క పవిత్ర ధూళిలో ఆడుతూ ఆడుతూ ఆకాశరూపంలో వున్న ఆ పరమాత్మ యొక్క గొడుగు క్రింద, పతిత పావన గంగా యమునా నదులపై నుంచి వీచే అందమైన, పవిత్రమైన గాలి సుగంధంలో మనం కబడ్డీ ఆడి తద్వారా అఖంత భారతాన్ని సాక్షాత్కరింపజేసుకున్నాం’’ అని గురూజీ ముగించారు.





