News

పాఠశాలను ఏర్పాటు చేసుకున్న గిరిజనులు

122views

పద్నాలుగేళ్లలోపు పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా పరిగణిస్తూ విద్యాహక్కు చట్టం దేశంలో అమలులోకి వచ్చి పదిహేనేళ్లు దాటుతున్నా, నేటికీ చాలా గిరిజన ప్రాంతాలు ఈ హక్కుకు నోచుకోవడం లేదు. మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పుర్‌ జిల్లా నేపానగర్‌ పట్టణ సమీపంలోని బోమలియపాట్‌ ఫలియా గ్రామ దుస్థితే ఇందుకు నిదర్శనం. సాధారణంగా గిరిజన గ్రామాల వంటి వెనుకబడిన ప్రాంతాల్లో విద్యావ్యాప్తికి ప్రభుత్వ అధికారులే ప్రజల వెంటపడుతూ ఉంటారు. బోమలియపాట్‌ ఫలియాలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. తమ పిల్లలకు చదువు కావాలంటున్న ఇక్కడి గిరిజనులు వాళ్లే ఓ రేకుల షెడ్డులో పాఠశాలను ఏర్పాటు చేసుకున్నారు. ఇందులో 60 మంది పిల్లలకు తొమ్మిదో తరగతి వరకు చదివిన సీమా బడోలే అనే యువతి జీతం లేకుండా పాఠాలు చెబుతోంది. మరింతమంది పిల్లలు ఆసక్తి చూపుతున్నా, తగినంత స్థలం లేదని సీమా బడోలే తెలిపింది. గ్రామంలో తక్షణం పాఠశాల భవనం నిర్మించి, ఉపాధ్యాయులను నియమించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వచ్చే విద్యాసంవత్సరం నాటికల్లా గ్రామ విద్యార్థులకు ఈ సదుపాయాలన్నీ అందుబాటులోకి వచ్చేలా ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపుతామని గిరిజన సంక్షేమశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ భారత్‌ జాంచ్‌పురే తెలిపారు.