
140views
సంఘ్ దృక్పథం అంతా కూడా పూర్తిగా భారతీయ ఆలోచనా విధానాల నుంచే ఉద్భవించిందని ఆరెస్సెస్ సర సంఘచాలక్ మోహన్ భాగవత్ అన్నారు. సంఘ్ పై నేడు సమాజం అంచనాలు కూడా పెరిగాయన్నారు. సంఘ్ కార్య శతాబ్దిని పురస్కరించుకొని గోరఖ్ పూర్ లోని తారామండల్ బాబా గంభీర్ నాథ్ ఆడిటోరియంలో కార్యక్రమం జరిగింది.
ఈ సందర్భంగా మోహన్ భాగవత్ మాట్లాడుతూ సమాజానికి ఆనందం, శాంతిని కలిగించే పద్ధతి ప్రపంచంలో లేదన్నారు. అందుకే ప్రజలు సంఘ్ వైపు ఆశతో ఎదురుచూస్తున్నారని వివరించారు. భారతీయ జ్ఞాన సంప్రదాయాన్ని విచ్ఛిన్నం చేసి, వారి సంప్రదాయాన్ని నెలకొల్పడానికి పాశ్చాత్యులు ప్రయత్నాలు చేశారని, వాటి ప్రభావం భారత్ పై పడటం ప్రారంభమైందన్నారు.
అయితే.. సమాజంలో తలెత్తే సందేహాలను పరిష్కరించగలిగే సత్తా భారతీయ జ్ఞాన సంప్రదాయానికే వుందని నొక్కి చెప్పారు. అందుకే సంఘ కార్యశతాబ్ది సందర్భంగా ప్రజల వద్దకు వెళ్లాలని నిర్ఱయించుకున్నామని వివరించారు. సంఘ్ అనేది స్వయంప్రతిపత్తి కలిగిన, స్వతంత్రమైన మరియు స్వావలంబన కలిగిన సంస్థ అని, పూర్తిగా సమాజానికే అంకితమైన సంస్థ అని పేర్కొన్నారు. సమాజం మొత్తం ఆరోగ్యంగా పనిచేస్తుంటే సంఘ్ అవసరం ఇక వుండదన్నారు.
సంఘ్ ఏదైనా ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడింది కాదని, ఎవరితోనూ విభేదించడానికి ఏర్పడిన సంస్థ కాదని పునరుద్ఘాటించారు. అలాగే ఎవ్వరికీ పోటీ కూడా కాదన్నారు. అలాగే ప్రజాదరణను గానీ ఆశించదని, బదులుగా సమాజ ప్రయోజనం కోసం అన్ని పనులను చేస్తుందన్నారు. సంఘ్ నాశనం చేయడానికి వచ్చింది కాదని, పూర్ణత్వం చేకూర్చడానికి వచ్చిందని, ఎవ్వరినీ నాశనం చేయడానికి ఆవిర్భవించలేదన్నారు.

భారత్ కి స్వాతంత్రం సిద్ధిస్తుంది కానీ.. మళ్లీ అది కోల్పోకూడదని హెడ్గేవార్ భావించేవారని, కాబట్టి మనలోని లోపాలను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా వుందన్నారు. ఇందు కోసం సమాజాన్ని సిద్ధం చేయాల్సిన అవసరం వుందని, మన స్వార్థాన్ని త్యజించి, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడానికి అందరూ ఐక్యంగా రావాలని పిలుపునిచ్చారు. ఈ ఉద్దేశ్యంతోనే 1925 లో విజయదశమి నాడు సంఘ్ ను స్థాపించారన్నారు. స్థాపన జరిగి 14 సంవత్సరాలు అయిన తర్వాత సంఘ కార్య పద్ధతి మరింత స్పష్టమైందని, సంఘ్ ప్రేమ, సంస్కారాలు, శాశ్వత సూత్రాలతో నడుస్తుందన్నారు.
సంఘ్ హిందూ సమాజం గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుతుందో వివరిస్తూ, ఈ దేశంలో నివసించే ప్రతి వ్యక్తి హిందువు అని పునరుద్ఘాటించారు. సమాజంలో వివిధ మతాలు, భిన్న మార్గాలు వున్నాయి కానీ.. లక్ష్యం మాత్రం ఒక్కటేనన్నారు. యావత్ హిందూ సమాజాన్ని సంఘటితం చేయడమే సంఘ్ లక్ష్యమని మోహన్ భాగవత్ తెలిపారు.




