
మహానంది పుణ్యక్షేత్రంలో ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నాం. ఉత్సవాలను తిలకించేందుకు మన రాష్ట్రంతోపాటు తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం. దర్శనం సాఫీగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నాం’ అని మహానంది దేవస్థానం ఈవో నల్లకాల్వ శ్రీనివాసరెడ్డి చెప్పారు. వాహనాల పార్కింగ్‌కు సుమారు 17 ఎకరాల విస్తీర్ణంలో అవసరమైన ఏర్పాట్లు చేశాం. వాహనదారులు తగిన ప్రదేశంలోనే వాహనాలు ఆపాల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం
ఉత్సవాల నేపథ్యంలో పండితులు కంకణధారణ చేస్తారు. ఈ నేపథ్యంలో గర్భగుడిలో స్వామివారి స్పర్శ దర్శనం ఉండదు. ఒకవేళ అభిషేకాలు చేసుకోవాలనుకుంటే వినాయక నందీశ్వరాలయంలో ఏర్పాట్లు ఉంటాయి. రుద్రగుండం పుష్కరిణిలోనూ పుణ్యస్నానాలు ఉండవు. ఉత్సవాలు ముగిశాకే గర్భాలయ ప్రవేశం ఉంటుంది. అంతవరకు భక్తులకు నిజరూప అలంకార దర్శనం మాత్రమే ఉంటుంది.
1.50 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తాం
సుమారు 1.50 లక్షల లడ్డూల తయారీకి అవసరమైన పదార్థాలు సిద్ధంగా ఉంచుతున్నాం. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైతే మరిన్ని చేయిస్తాం. ఉత్సవాల రోజులన్నీ కలిపి 1.20 లక్షల మంది రావొచ్చని అంచనా. క్యూలైన్లలో మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లను దాతల సహకారంతో పంపిణీ చేస్తాం. భక్తులు ప్రశాంతంగా దర్శనాలు చేసుకొని ఉత్సవాల విజయవంతానికి చేయూతనివ్వాలి.
వైద్య శిబిరాల ఏర్పాటు
- క్షేత్రంలో మూడు వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. తిమ్మాపురం, గాజులపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు నంద్యాల రెడ్‌క్రాస్, జిందాల్ సిమెంట్ కర్మాగారం తరఫున భక్తుల ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకున్నాం. అత్యవసర వైద్యం నిమిత్తం 108 వాహనం సిద్ధంగా ఉంటుంది.
- నంద్యాల ఆర్టీసీ బస్సు డిపో నుంచి 20 బస్సులు నడుపుతున్నారు. ఎస్పీ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
- మొబైల్ మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తున్నాం. స్వచ్ఛమైన నీటితో ఆహార పదార్థాలు తయారు చేయాలని వ్యాపారులకు సూచించాం. ఫుడ్ ఇన్‌స్పెక్టర్లతో తనిఖీలు చేయిస్తాం.
- మహాశివరాత్రి పర్వదినం రోజున అర్ధరాత్రి సమయంలో రూ.100 టికెట్‌తో భక్తులకు నిజరూప దర్శనం అందుబాటులో ఉంటుంది.
- భక్తులను ఆకర్షించేలా విద్యుత్తు దీపాలతో సుందరంగా అలంకరిస్తున్నాం. 24 గంటలపాటు విద్యుత్తు సరఫరా ఉండేలా ఆశాఖ అధికారులతో చర్చించాం. అవసరమైనచోట్ల జనరేటర్లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం.





