News

‘ప్రసాద్‌’ పథకంలో మంగళగిరి ఆలయానికి అభివృద్ధికి ప్రణాళిక

140views

ప్రసిద్ధ మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘ప్రసాద్‌’ పథకంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఈ పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకుగానూ దేవాదాయశాఖ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఈ పథకంలో సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలను ఇప్పటికే చేర్చారు. వారసత్వ సంపదను, గత వైభవం దెబ్బతినకుండా ఉన్న ఆలయాలను అదే రీతిలో కొనసాగిస్తూ దేశం నలుమూలల నుంచి నృసింహుని దర్శించుకునే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు పలు అంశాలను పొందుపరిచారు. సంబంధిత సమాచారాన్ని కేంద్రానికి పంపారు. చిన్నచిన్న మార్పులతో డీపీఆర్‌ పూర్తిచేసి టెండర్లు ఆహ్వానానికి కసరత్తు చేస్తున్నారు.

ప్రతిపాదిత అంశాలు ఇలా.. కొండ శిఖర భాగాన గండాలయస్వామి ఆలయ అభివృద్ధితోపాటు నేరుగా కొండపైకి వెళ్లేందుకు రోప్‌వే

  • కొండపై పార్కింగ్, ఉద్యానవనాలు ఏర్పాటు
  • దిగువ భాగాన భక్తుల సౌకర్యార్థం వసతి గదుల నిర్మాణం, కొండపై శిఖరాన 18 అడుగుల ఎత్తులో ‘మంగళగిరి’ అనే పేరుతో అక్షరాలు.
  • దేవాలయానికి వెళ్లే మార్గంలోని పోలీసులు క్వార్టర్స్‌ స్థలాన్ని ఆలయానికి తీసుకుని భక్తులు సౌకర్యార్థం అభివృద్ధి చేయడం
  • ఆలయ ప్రాశస్త్యం, చారిత్రక అంశాలతో మ్యూజియం
  • ఎయిమ్స్‌ రహదారి నుంచి పానకాలస్వామి కొండపైకి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణం
  • అసంపూర్తిగా నిలిచిన పడమర గాలిగోపురం నిర్మాణం పూర్తి చేయడం.