ArticlesNews

ఆధ్యాత్మిక శిశిరం

111views

శిశిర రుతువు చలిగాలులకు వీడ్కోలు పలుకుతూ, ప్రకృతి కొత్త చిగుళ్లు తొడిగే అద్భుత కాలం ఫాల్గుణం. ఆధ్యాత్మికంగా, సామాజికంగా, ఆరోగ్యపరంగా ఈ మాస ప్రాముఖ్యత అనన్యం.

చాంద్రమాన గణన ప్రకారం చంద్రుడు ఫల్గుణి నక్షత్రం సమీపంలో ఉండటం వల్ల ఫాల్గుణమాసం అనే పేరొచ్చింది. సూర్యుడు కుంభరాశి వీడి మీన రాశిలోకి ప్రవేశించే ఈ సమయం.. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉంటుంది. ఈ మాసం పండుగలకు పెట్టింది పేరు. ప్రతి తిథి ఒక విశేషాన్ని మోసుకొస్తుంది. తెలుగు సంవత్సరంలో ఇది చివరి నెల కావడంతో, గడిచిన ఏడాది జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ.. కొత్త ఏడాదికి స్వాగతం పలికే సంధి కాలంగా దీన్ని భావిస్తారు.

ఫాల్గుణ మాసం త్రిమూర్తుల అనుగ్రహానికి నిలయం. పురాణ కథనాలను అనుసరించి ఈ మాసంలో ఎన్నో దివ్య ఘట్టాలున్నాయి.

అర్జునుడికి గల పది పేర్లలో ‘ఫల్గుణుడు’ ఒకటి. ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో జన్మించడం వల్ల ఆయనకు ఆ పేరు స్థిరపడింది. ధైర్య సాహసాలు కావాలనుకునే వారు ఈ నెలలో అర్జున నామ స్మరణ చేయడం ఆచారం.

మాఘ బహుళ చతుర్దశి మహాశివరాత్రి. రోజంతా శివ నామస్మరణ, రాత్రి జాగరణ చేయడం వల్ల మనలోని అజ్ఞానాంధకారం తొలగి జ్ఞానోదయం కలుగుతుంది.

క్షీర సాగర మథనం జరిగి మహాలక్ష్మి ఉద్భవించిన ఫాల్గుణ పూర్ణిమను ‘లక్ష్మీ జయంతి’గా వేడుక చేస్తారు. ఈ రోజు లక్ష్మీ అష్టోత్తర పఠనంతో ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఫాల్గుణ పూర్ణిమ నాడు దేశమంతా సంబరాలు చేసుకునే పండుగ హోలీ. దీని వెనుక లోతైన అంతరార్థం ఉంది. శివుడి తపస్సును భగ్నం చేయడానికి ప్రయత్నించిన మన్మథుడు ఈ రోజే భస్మమయ్యాడు. రంగులు చల్లుకోవడం వెనుక ప్రకృతిలోని వైవిధ్యాన్ని ఆస్వాదించాలనే ఉద్దేశం కనిపిస్తుంది.

ఫాల్గుణ శుద్ధ ఏకాదశిని ఆమలకీ ఏకాదశి అంటారు. ఉసిరిచెట్టులో శ్రీమహావిష్ణువు నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున ఉసిరిచెట్టు కింద పూజలు చేసి, ఉసిరి ఫలాలను దానం చేయడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం లభిస్తుందని ప్రతీతి. ఆమలకీ ఏకాదశి కారణంగా ఉసిరి వాడకం పెరుగుతుంది. ఇందులో ఉండే సి-విటమిన్‌ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

ఫాల్గుణ మాసం జాతరలకు, ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి. పంటలు చేతికి వచ్చే సమయం కావడంతో రైతులు ఉత్సాహంగా వీటిలో పాల్గొంటారు. గుంటూరు జిల్లాలోని కోటప్పకొండలో జరిగే ప్రభల ఊరేగింపు.. ఒక అద్భుత దృశ్యం. మెదక్‌ జిల్లాలోని ఏడుపాయల వద్ద శివరాత్రి సందర్భంగా జాతర ప్రారంభమై ఈ మాసాంతం వరకూ కొనసాగుతుంది. లక్షలాది మంది భక్తులు ఈ జాతరకు తరలి వస్తారు.రుతువుల మార్పు జరిగే ఈ కాలంలో మన శరీరం ఎన్నో మార్పులకు లోనవుతుంది. శిశిరంలో చర్మం పొడిబారు తుంది కాబట్టి.. అభ్యంగన స్నానాలకు ప్రాధాన్యత ఇస్తారు. మండు వేసవి రాకముందే శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు తీసుకోవడం ప్రారంభించాలి.

జ్యోతిష శాస్త్రం ప్రకారం ఫాల్గుణమాసం వివాహ శుభకార్యాలకు అనుకూలమైంది. ఈ మాసంలో జరిగే వివాహాలు సుఖప్రదంగా ఉంటాయని విశ్వసిస్తారు. గృహప్రవేశాలకు, ఉపనయనాలకు కూడా ఈ మాసం శ్రేష్ఠమైంది. ఫాల్గుణం అంటే ముగింపేమీ కాదు, కొత్త పుంతలకు పునాది. మన జీవితాల్లోని కలహాలు, ద్వేషాలను హోలీ మంటల్లో నశింపచేసి, కొత్త ఆశలతో వసంత రుతువుకు సిద్ధమవ్వమని చెప్పడమే ఈ మాసం ఇచ్చే గొప్ప సందేశం.