
( ఫిబ్రవరి 13 – పాల్గుణ కృష్ణ ఏకాదశి గురూజీ జయంతి )
గురూజీగా ప్రసిద్ధి చెందిన శ్రీ మాధవరావు సదాశివరావు గోల్వాల్కర్ గారు రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ రెండవ సర్ సంఘ్‌చాలక్‌గా సేవలు అందించారు. ఆయన తన జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘ కార్యానికి సమర్పించారు. 66 సార్లు ఆసేతు హిమాచలం పర్యటించారు. జాతి హితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయంసేవకుల పాత్ర ఉండేలా వివిధ సంస్థలను ప్రారంభించారు. దేశం మొత్తం పర్యటిస్తూ స్వయం సేవకులకు, వివిధ రంగాల్లో పని చేస్తున్న వ్యక్తులకు, సంస్థలకు మార్గదర్శిగా నిలిచారు.
ఎం.ఎస్.గోల్వాల్కర్ గారు 1906 పాల్గుణ కృష్ణ ఏకాదశి నాడు రామ్‌టెక్‌లో జన్మించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 13 ఆయన జయంతి. గోల్వాల్కర్ గారి తల్లిదండ్రులు సదాశివరావు, లక్ష్మీబాయి. వాళ్లు ఆయనకు పెట్టిన పేరు మాధవ్. ఎమ్మెస్సీ ఎల్‌ఎల్‌బీ చదివి, కొద్దికాలం పాటు బీహెచ్‌యూలో ప్రొఫెసరుగా పని చేశారు. సూక్ష్మగ్రాహి, వివిధ విషయాల పట్ల లోతైన అవగాహన ఉన్నవారు. తమ వేతనంలో ఎక్కువ భాగాన్ని పేద విద్యార్థుల చదువులకు, పుస్తకాలకు ఖర్చు చేసేవారు. అందుకే ఆయనను విద్యార్థులంతా ప్రేమగా గురూజీ అని పిలిచేవారు. తర్వాత అదే పేరు స్థిరపడిపోయింది.
గురూజీ జీవితంలోకి సంఘం, ఆధ్యాత్మిక జీవితం రెండు సుమారుగా ఒకేసారి ప్రవేశించాయి. వారు స్వామి వివేకానంద అంతర్ దృష్టికి, ఆచరణాత్మక దృక్పథానికి దగ్గరగా ఉన్న సంఘ కార్యాన్ని తన జీవితానికి ఏకైక లక్ష్యంగా చేసుకున్నారు. క్రమంగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ జీ సహచర్యంతో సంఘ కార్యంలో పూర్తిగా లీనమయ్యారు. డాక్టర్ జీ సూచనతో వారి తదనంతరం రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌కు ద్వితీయ సర్ సంఘ్‌చాలక్‌గా 1940లో బాధ్యతలు స్వీకరించారు.
గురూజీ బాధ్యతలను స్వీకరించిన కొన్నేళ్లకే సంఘానికీ, దేశానికీ పరీక్షా కాలం ఎదురైంది. స్వాతంత్ర్యం సిద్ధించిందిగానీ దేశం రెండు ముక్కలయ్యింది. గాంధీజీ హత్య తర్వాత సంఘంపై నిషేధం విధించారు. ఈ పరీక్ష సమయంలో గురూజీ ఎంతో గొప్ప నాయకత్వ పటిమను ప్రదర్శించి అన్ని సవాళ్ల నుంచి సంఘాన్ని ముందుకు తీసుకువెళ్లారు. పాకిస్థాన్‌లో కలిసే ప్రాంతాల నుంచి హిందువులను సురక్షితంగా వెనుకకు తీసుకువచ్చే విధంగా స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు.
దేశ విభజన తర్వాత దేశంలో సామరస్య భావవను నింపడం కోసం దేశమంతటా గురూజీ పర్యటించారు. 1948 జనవరి 14న బొంబాయిలో జరిగిన ఒక కార్యక్రమంలో భిన్నాభిప్రాయాలు ఉన్న వ్యక్తులు కూడా సమాజంలో భాగమే కాబట్టి, వాళ్లు కూడా సమాజం కోసం త్యాగాలు చేసి ఉన్నారు కాబట్టి, వారిని స్వంత సోదరులుగా భావించాలి అని పిలుపునిచ్చారు. గురూజీ జాతీయ భద్రత విషయంలో ఎంతో దూరదృష్టి కలిగి ఉండేవారు. ఆయన కృషి ఫలితంగానే కశ్మీరు భారతదేశంలో భాగం అయింది. చైనా దుందుడుకు స్వభావాన్ని, ఆక్రమణ మనస్తత్వాన్ని గురూజీ ముందే పసిగట్టారు. అనేక సందర్భాల్లో చైనా గురించి మన దేశ పాలకులను హెచ్చరించారు. టిబెట్‌ను చైనాకు బహుమతిగా ఇవ్వడం చారిత్రక తప్పిదమని అప్పుడే చెప్పారు. ఆయన హెచ్చరించినట్టుగానే చైనా మన దేశంపై దాడి చేసి సరిహద్దులలో కొంత భూభాగాన్ని ఆక్రమించింది.
చైనాతో జరిగిన యుద్ధంలో కలిగిన పరాభవం నుంచి జాతి కోలుకోవటానికి, ప్రజల్లో స్వాభిమానాన్ని నింపేందుకు వివేకానంద రాక్ మెమోరియల్ నిర్మాణం దిశగా గురూజీ మార్గదర్శనం చేశారు. ఆయన సర్ సంఘ్‌చాలక్‌గా 33 ఏళ్లు పని చేశారు. 67 ఏళ్ల వారి జీవితంలో సగం కంటే ఎక్కువ కాలాన్నే సంఘ కార్యానికి సమర్పించారు. రైలు డబ్బానే ఇల్లుగా చేసుకొని 66 సార్లు ఆసేతు హిమాచలం పర్యటించారు. జాతి హితం కొరకు అనేక ప్రాంతాల్లో స్వయంసేవకుల పాత్ర ఉండేలా అనేక రకాల సంస్థలను ప్రారంభించారు. రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌ను విదేశాలకు సైతం విస్తరించారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ విస్తరణలో కీలక పాత్ర పోషించిన గోల్వాల్కర్ గారు 1973 జూన్ 5న కన్నుమూశారు. వారి ఆలోచనలు ఇప్పటికీ మనకు మార్గదర్శకమే. గురూజీకి మనం సదా రుణపడి ఉంటాం.





