
ప్రతి గ్రామంలో చారిత్రాత్మక అంశాలు, విశేషాలుంటాయి. వాటిని గర్వకారణంగా భావిస్తుంటారు. అటువంటి వాటిని చాటి చెప్పేందుకు, సాంస్కృతిక వారసత్వ వెలుగుల్ని నలుదిశలా విస్తరింపజేసేందుకు కేంద్రం ఓ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వివరాల నమోదుకు ‘నా గ్రామం.. నా వారసత్వం’ పేరుతో ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఇందుకుగాను సిబ్బందికి అధికారులు శిక్షణ ఇస్తున్నారు. అనంతరం ఈ నెల 27 నుంచి నమోదుకు శ్రీకారం చుట్టనున్నారు.
ఏమేం నమోదు చేస్తారంటే!: గ్రామాల వారసత్వ విశేషాలు, చారిత్రక అంశాలు. ఆచారాలు, ఉత్సవాలు, మేళాలు, కళాకారుల వివరాలు. సాంస్కృతిక వారసత్వ స్థలం, వస్తువులు, కళాఖండాల వివరాలు, భౌగోళిక ఆకర్షణలు.
ప్రయోజనమేమంటే!
గ్రామీణ ప్రాంతాల విశిష్టత ఇతరులకు తెలుస్తుంది. పర్యాటక ప్రాంతాలను ఇతరులకు మరింత చేరువ చేసేందుకు దోహదమవుతుంది. క్షేత్రస్థాయిలో సందర్శణీయ ప్రాంతాల నమోదు, విశేషాలతో కూడిన యాప్ వినియోగంలోకి వస్తే, పర్యాటక రంగానికి పరిపూర్ణ రూపు వస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విశేషాలు, విశిష్టత నమోదుతో భవిష్యత్ తరాలు తమ సంస్కృతి విశేషాలను తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది.





