News

గువాహటిలో అద్భుతమైన బగురుంబా నృత్య కార్యక్రమం..

233views

అస్సాం రాష్ట్రంలో అతిపెద్ద నగరం, ఈశాన్య భారతదేశంలో ప్రధాన వాణిజ్య కేంద్రం గేట్‌వేగా గువాహటి నగరానికి పేరుంది. బ్రహ్మపుత్ర నదీ ఒడ్డున ఉన్న ఈ నగరంలో కామాఖ్య, ఉగ్రతార వంటి అనేక పురాతన దేవాలయాలు, చారిత్రక ప్రాముఖ్యత, విభిన్న వన్యప్రాణులు, రుచికరమైన అస్సామీ వంటకాలు, మంచి రవాణా సౌకర్యాలు ఉన్నాయి. దీనిని ‘దేవాలయాల నగరం’ అని కూడా పిలుస్తారు.

ఈ పవిత్ర నగరమైన గువాహటిలోని సరుసాజై స్టేడియంలో ‘బగురుంబా ద్వౌ 2026’ కార్యక్రమం కన్నులపండువగా సాగింది. భారతీయ సంస్కృతి వైవిధ్యాన్ని మరోసారి ప్రపంచానికి చాటిచెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఈ చారిత్రాత్మక ఈవెంట్‌లో 10,000 మందికి పైగా బోడో కళాకారులు ఒకే సమయంలో, ఒకే విధంగా బగురుంబా నృత్య ప్రదర్శన చేసి ఆకట్టుకున్నారు.

Bagurumba-2.jpg

బోడో సమాజానికి చెందిన ఈ సంప్రదాయ నృత్యం.. సీతాకోకచిలుకలు ఎగరడాన్ని పోలిన మృదువైన కదలికలతో ప్రకృతిని ప్రతిబింబించింది. అలాగే వసంత ఋతువు రాకను, పూలు, సీతాకోకచిలుకలను సూచిస్తూ ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యం కలిగి ఉంది. ఈ కార్యక్రమం బోడో సమాజం గొప్ప వారసత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది. స్టేడియంలో ఎరుపు, నారింజ రంగుల సంప్రదాయ దుస్తులు ధరించిన వేలాది నృత్యకారులు ఒకే సమయంలో కదలికలు చేస్తూ అద్భుతమైన దృశ్యాన్ని సృష్టించారు. ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించే అవకాశం ఉంది.

ప్రధానమంత్రి మోదీ ఈ ఈవెంట్‌లో పాల్గొని బోడో సంప్రదాయ సంగీత వాయిద్యం ‘సెర్జా’ను తిలకించారు. అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కూడా హాజరైన ఈ కార్యక్రమం.. ఈశాన్య భారతదేశ సాంస్కృతిక ప్రాముఖ్యతను జాతీయ స్థాయిలో చాటిచెప్పింది.

భారతదేశ వైవిధ్యతను ఏకం చేస్తూ, వివిధ సమాజాల మధ్య ఐక్యతను పెంచే విధంగా అస్సాం రాష్ట్రంలో బగురుంబా నృత్య ప్రదర్శన జరిగింది. భావి తరాలకు సాంస్కృతిక వారసత్వాన్ని అందించే విధంగా సాగింది. దీనికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ పోస్ట్ చేశారు. గువాహటిలో అద్భుతమైన బగురుంబా ద్వౌ కార్యక్రమం అని మోదీ పేర్కొన్నారు.