ArticlesNews

గమ్యం – గమనం

170views

సమస్త విశ్వంలో గమ్యం తెలిసి జీవించగల అవకాశం మనిషికి మాత్రమే ఉంది. గమ్యం అంటే ఒక లక్ష్యం కలిగి ఉండటం. గమ్యం వైపు గమనం సక్రమంగా ఉన్నప్పుడే అనుకున్నది సాధించగలరు ఎవరైనా. ఒడుదుడుకుల్ని తట్టుకుంటూ, అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్లగలగాలి. అందుకు తగిన పట్టుదల, ఓర్పు, గురి తప్పనిసరి. ఉత్తముడిగానో, ఐశ్వర్యవంతుడిగానో పుట్టడం ఏ వ్యక్తి చేతుల్లోనూ ఉండకపోయినా నలుగురికి ఉపకారం చేసి వెళ్లగలగడం మాత్రం మన చేతుల్లోనే ఉంటుంది. కీర్తిశేషులుగా నిలిచిపోయే వ్యక్తులు అతితక్కువగా కనిపించడానికి కారణం గమ్యం తెలిసినా, గమనం పట్ల నిబద్ధత లేకపోవడమే.

సమయాన్ని బట్టి సంయమనంతో వ్యవహరించిన పుణ్య పురుషులు శ్రీరామలక్ష్మణులు. అకస్మాత్తుగా నార దుస్తులతో అడవులకేగాల్సి వచ్చినా తమ గమ్యమేమిటో తెలిసి గమనాన్ని ప్రారంభించారు. గతంలో విశ్వామిత్ర మహర్షి సహకారంతో పొందిన రాక్షస సంహార అనుభవం, శస్త్ర విద్య తోడుగా లోకానికి రావణసంహారమనే మహోపకారాన్ని చేశారు. గమ్యం పట్ల, గమనం పట్ల అవగాహన అది.

శిఖరాగ్రాన్ని చేరాలనే కోరిక ఉన్న వాళ్లలో ఎక్కువమంది మధ్యలోనే వదిలివేయడం చూస్తుంటాం. విజయం వరించాలంటే ఏటికి ఎదురీదాల్సిందే. దేన్నయినా సాధించే క్రమంలో చేయందించడం కన్నా, కాళ్లు పట్టుకు కిందికి లాగడమే లోకరీతి. నూతిలోని కప్ప బయటపడాలంటే, అది పట్టుదలగానైనా ఉండాలి, లేక చెవిటిదైనా అయి ఉండాలి. నిరాశకు మనిషి బుద్ధిని మార్చేయగల శక్తి ఉంది. ప్రయత్నాన్ని వదిలివేయమని, ప్రయాస వ్యర్థమేనని వెంటపడుతుంది. ఆశ మాత్రం మరొక్కసారి ప్రయత్నించమంటుంది. రెండింటిలో దేన్ని అనుసరించాలో నిర్ణయించుకోవాల్సింది మనిషే. గమ్యం పట్ల ఎడతెగని ప్రీతి ఉన్నవాడికి ఆ క్రమంలో వచ్చే ఆటుపోట్లన్నీ దాటిపోవాల్సినవిగానే తోస్తాయి.

సంక్షోభం నుంచి సంక్షేమం వైపు సామ్రాజ్యాన్ని ఒంటి చేతితో నడిపిన మాల్వా సామ్రాజ్యపు హోల్కరు వంశ రాణి అహల్యా బాయిని ఒకసారి గుర్తుచేసుకుంటే గమనం ఎలా ఉంటే గమ్యం సిద్ధిస్తుందో తెలుస్తుంది. కట్టుకున్నవాడు, కన్నకొడుకు కళ్లముందే కడతేరిపోగా, ఒంటరిగా మిగిలిన ఆమె- మామగారు మల్హర్‌ రావు హోల్కర్‌ అప్పగించిన పరిపాలన అనే బాధ్యతను గౌరవంతో స్వీకరించింది. అబలగా భావించి దండెత్తివచ్చిన శత్రుసేనలను మొక్కవోని ధైర్యంతో మట్టికరిపించింది. దశాబ్దాలపాటు సుపరిపాలన గావించి చరిత్రలో నిల్చిపోయిందంటే అదీ ఆమె గమనంలోని నిబద్ధత!

ఏ మనిషికైనా మంచిమిత్రుడు తన ఆత్మే. అది మాట వినాలంటే, ముందు తన బలాలూ బలహీనతలను సరిగ్గా తెలుసుకోగలగాలి. ఏ వ్యక్తీ పరిపూర్ణుడు కాడు. అందరూ అన్నింటినీ సాధించలేరు. అందరి శారీరక, మానసిక శక్తులు సమానం కావు. ఎవరి ప్రయాణం వారిదే. ఎవరి ప్రాధాన్యాలు వారివే. చేరే గమ్యం ఒకటే అయినా, విభిన్నమైనా ఎవరి వ్యూహాన్ని వారే రచించుకోవాలి. బలహీనతలను బలంగా మార్చుకున్నప్పుడే గమ్యం చేరడం తేలిక అవుతుంది.