ArticlesNews

అన్నదానం కాశి నాయన సమతా సందేశం

185views

( డిసెంబర్ 6 – కాశి నాయన వర్ధంతి )

ఆయన ఒక మహర్షి, అవధూత, పేదవాడి ఆకలి తీర్చడం, లేనివాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప మనిషి. ఆకలి అన్నవారికి అన్నం పెట్టిన ఆధ్యాత్మిక గురువు భగవాన్ శ్రీ కాశి నాయన. నిరతాన్నదానము, సేవ, ప్రేమ, ఆలయాల పునరుద్ధరణలను అకుంఠిత తపస్సుగా ఆచరించి, మనల్ని కూడా ఆ బాటలో నడవమని బోధించారు. ఆధ్యాత్మిక గురువు కాశినాయన నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకి పుష్యమాసము అమావాస్య, 1895 జనవరి 15న కాశిరెడ్డి జన్మించారు. ఈయన అసలు పేరు మున్నల్లి కాశిరెడ్డి.

కాశి నాయనకు చిన్నతనం నుండి కూడా దైవభక్తి ఎక్కువగా ఉండేది. వేమూరి రామయ్య గారి వద్ద కాశి నాయన విద్యను అభ్యసించారు. తర్వాత సంస్కృత భాషలోని అమరకోశము మూడు కాండలు, నరసింహ శతకములోని పద్యాలు చక్కగా గురు ముఖతః కంఠస్థం చేసి, భారత, రామాయణ, భాగవతములను అవగాహన చేసుకొన్నారు. తనకి 16 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చదువు ఆపేసి కాశినాయన వ్యవసాయ చేయడం మొదలుపెట్టాడు. ఒకరోజు కాశిరెడ్డి గారు వేప చెట్టు కింద కూర్చొని ఉండగా తనకి మనసులో ఏదో ఆలోచన కలిగి అలా నడుచుకుంటూ, సద్గురువును వెతుకుతూ ప్రకాశం జిల్లా వెలిగండ్ల గ్రామానికి చేరి శ్రీ అతిరాచ గురవయ్య స్వామి గారి వద్ద శిష్యునిగా చేరారు.

గురువు గారి వద్ద శాస్త్ర ధర్మాన్ని, లోకాచారాన్ని పాటించి పరిపూర్ణ స్థితికి చేరుకున్నారు. గురువాజ్ఞ తీసుకుని కాశీ నుండి కన్యాకుమారి వరకు అనేక క్షేత్రాలను దర్శించారు. అనంతరం నల్లమల అటవీ ప్రాంతంలోని జ్యోతి నరసింహస్వామిని దర్శించుకుని అక్కడే అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఆ తర్వాత కడప జిల్లాలో గరుడాద్రి ఆశ్రమం, పోరుమామిళ్ల దగ్గర లింగమయ్య కొండ మీద లింగమయ్య కొండ ఆశ్రమం, కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలంలో యోగానందాశ్రమము, కోటగొట్లలోని గని క్షేత్రంలో గని ఆశ్రమం, గంగన్నపల్లి మెట్ల ఆశ్రమం, గిద్దలూరు తాలూకా పుల్వల చెరువు గ్రామంలో కాలువ బుగ్గ ఆశ్రమం, సీతారామపురం ఆశ్రమం, నెల్లూరు జిల్లాలో సీతారామపురం మండలంలో ఘటిక సిద్దేశ్వరం ఆశ్రమం, ఉదయగిరిలో లింగాలదొనలో అన్నదాన క్షేత్రములను నెలకొల్పారు. ఈ ఆశ్రమాలలో నేటికీ అన్నదాన కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. అలాగే ఈ ఆశ్రమాలలో గోమాత ప్రాశస్త్యం తెలుపుతూ హైందవ ధర్మానుసారం గో సంరక్షణను చక్కగా నిర్వర్తించి గోమాత మహాత్మ్యమును వివరిస్తున్నారు.

కుల, మత, జాతి భేదం లేకుండా ఆర్తితో తమ వద్దకు వచ్చిన వారి కడుపు నింపి, అర్హతను బట్టి అనుగ్రహించి, దుర్మార్గులను సైతం సన్మార్గులుగా, సమర్థవంతంగా తీర్చిదిద్ది అవధూతగా వెలిసిన కాశి నాయన అందించిన సామాజిక సమరసతా సేవాస్ఫూర్తితో నేటికీ సుమారు 100 నిత్యాన్నదాన కేంద్రాలు నడుస్తున్నాయి. కడప జిల్లా నల్లమల అడవులకు చివరి గ్రామమైన కాశి నాయన మండలం వరికుంట్ల గ్రామానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ జ్యోతి లక్ష్మీ నరసింహ స్వామి వారి క్షేత్రంలో 1995 డిసెంబర్ 6వ తేదీన జ్యోతి క్షేత్రంలో జ్యోతిర్మయులుగా కాశి నాయన కాలం చెందారు. లేని వాడి కడుపు నింపడం నిజమైన మాధవ సేవ అని చెప్పిన గొప్ప అవధూత భగవాన్ శ్రీ కాశీ నాయన జీవితం సమరసతా కార్యాన్ని ముందుకు తీసుకెళ్తున్నవారందరికీ ఆదర్శం.