News

గోమాంసం నిల్వ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌

130views

విశాఖ గ్రామీణ పరిధిలోని శీతలగిడ్డంగిలో గోమాంసం నిల్వలు వెలుగులోకి రావడం ఇటీవల కలకలం రేపింది. ఈ కేసును దర్యాప్తు సంస్థలకు అప్పగించాలంటూ విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేస్తోంది. ఆనందపురం మండలం శొంఠ్యాం సమీపం దిబ్బమీదపాలెం గ్రామంలోని నాలుగు ఎకరాల్లో శీతల గిడ్డంగి ఎనిమిదేళ్ల ఏళ్ల క్రితం నిర్మించారు. గతంలో లీజుకు తీసుకున్న వారు పండ్లు, కూరగాయలు నిల్వ చేసి ఎగుమతి చేసేవారు గత వైకాపా ప్రభుత్వ హయాంలో శ్రీమిత్ర మెరైన్‌ కోల్డ్‌స్టోరేజీ పేరుతో ఓ బోర్డు పెట్టారు. గిడ్డంగిలో భాగస్వామి అయిన సుబ్రహ్మణ్య గుప్తా..ఓ మేనేజర్‌ను నియ మించుకుని పర్యవేక్షిస్తున్నారు. ఇన్నాళ్లు ఆక్వా ఎగుమతులు సాగేవని అంతా భావించారు.

ఆ డైరెక్టర్‌ సెంట్రల్‌ జైల్లో: ‘ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మెష్‌ ఓవర్‌సిస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధులు బఫెల్లో మాంసం నిల్వలు పెట్టుకున్నారు. బీఫ్‌ ఎగుమతులకు అనుమతులున్నాయంటూ కొన్ని జిరాక్సు పత్రాలు ఇచ్చారు. అంతవరకే నాకు తెలుసు తప్ప గోమాంసం అందులో ఉందని నాకు ఎలా తెలుస్తుంది?’ అని సుబ్రహ్మణ్య గుప్తా పోలీసుల విచారణలో చెప్పినట్లు సమాచారం. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సంస్థ డైరెక్టర్‌ను విచారణ చేయాల్సి ఉంది. అయితే సదరు వ్యక్తి డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌కు చెందిన ఓ కేసులో జైల్లో ఉన్నారని, కోర్టు అనుమతితో అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పోలీసులు చెబుతున్నారు.