
శ్రీ ధన్వంతరి జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకుని నంద్యాల జిల్లా, స్థానిక ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో విశ్వహిందూ పరిషత్ కార్యాలయంలో కుటుంబ సమ్మేళనంను నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ నంద్యాల జిల్లా అధ్యక్షులు శ్రీ అభిరుచి మధు, ప్రధాన వక్తగా అఖిల భారతీయ కళా విభాగ ప్రముఖులు మరియు సామాజిక సమరసతా వేదిక తెలంగాణ ప్రాంత సంయోజకులు మాన్యశ్రీ అప్పాల ప్రసాద్, ప్రభుత్వ ఆయుర్వేద వైద్య అధికారిణి డాక్టర్ యశోధర, ఆరోగ్య భారతి జిల్లా అధ్యక్షులు డాక్టర్ వి పరమేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఆహుతులు భరతమాత, ఆయుర్వేద వైద్య ఆది దేవుడు శ్రీ ధన్వంతరి చిత్ర పటాలకు పూలమాలలు సమర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
సభాధ్యక్షులు కార్యక్రమ సందర్భాన్ని, విశిష్టతను వివరించగా, ప్రధాన వక్త కుటుంబంలోని వ్యక్తుల మధ్య పెంపొందాల్సిన ప్రేమ బాధ్యతల గురించి, భారతీయ జీవన విలువల గురించి ఉదాహరణల ద్వారా చక్కగా వివరించారు. అలాగే పాశ్చాత్య సంస్కృతిక దాడికి గురై ఆధునిక కాలంలో మన కుటుంబ వ్యవస్థ ఎలాంటి ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది, ఆయా సందర్భాలలో పెద్దలు, తల్లిదండ్రుల పాత్ర ఏమిటి అనే విషయాన్ని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కుటుంబ సమేతంగా పరివార క్షేత్రాల కార్యకర్తలు, జ్యేష్ట కార్యకర్తలతో కలిపి దాదాపు 150 మంది పాల్గొన్నారు
కార్యక్రమ నిర్వహణకు కృషిచేసిన ఆరోగ్య భారతి కార్యకర్తలను ఆహుతులు ప్రశంసించారు. ఆరోగ్య ప్రదమైన సిరి ధాన్యాలతో తయారు చేసిన వంటకాల విందుతో కార్యక్రమం సంపన్నమైంది.





