News

ఉగ్రవాదుల్ని.. మద్దతుదారుల్ని ఒకేలా పరిగణిస్తాం

151views

ఉగ్రవాదులను, వారి మద్దతుదారులను భారత్‌ ఒకే విధంగా పరిగణిస్తుందని భారత సైన్యాధిపతి జనరల్‌ ఉపేంద్ర ద్వివేది స్పష్టంచేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్‌ పలు చర్యలు తీసుకుంటోందని పరోక్షంగా పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీ చేశారు.

ఓ ఇంటరాక్టివ్‌ సెషన్‌లో పాల్గొన్న ద్వివేది పలు అంశాలపై మాట్లాడారు. ‘‘పాకిస్థాన్‌తో వ్యవహరించే విషయంలో భారత్‌ కొత్త విధానాలను అనుసరిస్తోంది. మా దేశాన్ని లక్ష్యంగా చేసుకుంటున్న ఉగ్రవాద గ్రూపులకు మద్దతు కొనసాగిస్తే.. పాక్‌ తీవ్ర సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుంది. దేశ ప్రజల శ్రేయస్సు, పురోగతిపై భారత్‌ దృష్టి పెడుతోంది. మా లక్ష్యాలకు ఆటంకాలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బెదిరింపులకు లొంగిపోయే స్థితిలో నేడు భారత్‌ లేదు. శత్రువులను ఎదుర్కోవడానికి దేశ నాయకులంతా ఒకేతాటిపై నిల్చున్నారు’’ అని ద్వివేది నొక్కి చెప్పారు.

ఉగ్రవాద ముఠాలను ఎగదోయడం మానుకోకుంటే ఆ దేశ ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. మరోవైపు.. ఇటీవల కాలంలో జరిగిన భారత్‌- చైనా చర్చలతో ఏడాదిగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుగు పడుతున్నాయని ద్వివేది పేర్కొన్నారు.