News

మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరో ఎన్ కౌంటర్

138views

రాష్ట్రంలోని ఏజెన్సీ మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో మరోసారి ఎదురుకాల్పులు జరిగాయి. బుధవారం తెల్లవారుజామున జీఎం వలస పరిసరాల్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. వీరంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా తెలుస్తోంది. మృతులను మావోయిస్టులు జోగారావు అలియాస్‌ టెక్‌ శంకర్‌, సీత అలియాస్‌ జ్యోతి, సురేశ్‌, గణేశ్‌, వాసు, అనిత, షమ్మిగా గుర్తించారు. మరోవైపు మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల కూంబింగ్‌ కొనసాగుతోంది. మృతదేహాలను రంపచోడవరం ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిది: ఇంటెలిజెన్స్‌ ఏడీజీ
మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌ను ఏపీ ఇంటెలిజెన్స్‌ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా ధ్రువీకరించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మిగిలిన మావోయిస్టులు లొంగిపోవడం మంచిదన్నారు.

‘‘ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ నుంచి ఏపీకి రావడానికి మావోయిస్టులు ప్రయత్నిస్తున్నారు. పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి కదలికలను గమనిస్తున్నాం. నవంబరు 17న ఒక ఆపరేషన్‌ లాంచ్‌ చేశాం. 18న ఉదయం అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎదురుకాల్పులు జరిగాయి. సెంట్రల్‌ కమిటీ మెంబర్‌ హిడ్మా మద్వితో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మరోవైపు ఎన్టీఆర్‌, కృష్ణా, ఏలూరు, కాకినాడ, కోనసీమ జిల్లాల్లో 50 మందిని అరెస్టు చేశాం. వీరిలో స్పెషల్ జోనల్‌ కమిటీ మెంబర్లు ముగ్గురు, ప్లాటూన్‌ మెంబర్లు 23 మంది, డివిజినల్‌ కమిటీ మెంబర్లు ఐదుగురు, ఏరియా కమిటీ మెంబర్లు 19 మంది ఉన్నారు. ప్రజలకు ఎక్కడా హాని జరగకుండా ఈ అరెస్టులు చేశాం. దొరికిన మావోయిస్టుల నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నాం. మంగళవారం జరిగిన మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత కొందరు మావోయిస్టులు పారిపోయారు. వారిని కూడా పట్టుకునేందుకు బృందాలు రంగంలోకి దిగాయి.