
ఆరోగ్యానికి మేలు చేసే సంప్రదాయ, పురాతన విధానాలపై కొందరికి ఆసక్తి ఎక్కువ. నేటి ఆధునిక రోజుల్లోనూ అలనాటి పద్ధతులను పాటిస్తుంటారు. ఆ కోవకే వస్తారు…విశాఖ నగరానికి చెందిన బి. అజయ్‌కుమార్. విశాఖలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈయన ప్రదర్శించిన ‘పెళ్లి పత్రిక’ నమూనా ఎందరినో ఆకట్టుకుంది. దానిని తాటి ఆకులతో రూపొందించడం గమనార్హం. పెళ్లి పత్రికలను వైవిధ్యంగా తయారు చేస్తే ఎలా ఉంటుంది? అనే ఆలోచన రాగా ప్రయోగాత్మకంగా ఈ ప్రయత్నం చేశారు. ఆ కార్యాచరణను వివరిస్తూ ‘కొంచెం పచ్చిగా ఉన్న తాటి ఆకులను ఉడకబెట్టాలి. బాగా ఆరిన తర్వాత వాటిని తగిన ఆకృతుల్లో కత్తిరించాలి. బూజు, పురుగు పట్టకుండా పసుపు, నూనె కలిపి లేపనంగా పూయాలి. ఐరన్ పెన్‌తో ఆకులు చిరిగిపోకుండా చాలా జాగ్రత్తగా అక్షరాలు రాయాలి. నల్ల బొగ్గు పొడి, సహజ రంగులను అక్షరాలపై పూస్తే స్పష్టంగా కనిపిస్తాయి. ఈ విధానంలో శ్లోకాలు, ఆహ్వానితుల పేర్లు, పెండ్లి కుమార్తె, కుమారుడి వివరాలు, విందు, కల్యాణవేదికలను రాశా. ప్రయోగాత్మకంగా కార్డులు తయారు చేసి పంచుతున్నాం’ అని తెలిపారు. అజయ్‌కుమార్ గతంలో శాస్త్రవేత్తగా పనిచేశారు. ప్రస్తుతం రైతుగా మారి ఆధునిక వ్యవసాయం చేస్తున్నారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో పీహెచ్‌డీ కూడా చేస్తున్నారు.





