
నవయుగపు భారతదేశం
1. భారతీయ జ్ఞానం, దృష్టికోణం మరియు సంప్రదాయం
భారతదేశ జ్ఞానవివేకం కేవలం పుస్తకాలకే పరిమితం కాలేదు. అది జీవితంలోని ప్రతి దశతో ముడిపడి ఉంది. గార్హస్యం నుండి రాజధర్మం వరకు, వ్యవహారం నుండి తపస్సు వరకు. భారతీయ దృక్పథం ఎల్లప్పుడూ సమగ్రంగా ఉంది. అది కేవలం తన గురించి కాకుండా, యావత్ సృష్టి యొక్క సంక్షేమం గురించి మాట్లాడుతుంది. మన సంప్రదాయాలలో జీవితాన్ని ఒక యాత్రగా పరిగణించారు. మానవ జీవిత ఉద్దేశ్యం ఆత్మోన్నతి, లోకకళ్యాణం, రెండూ కూడా. ఈ సమతుల్యతే మనల్ని ఆధునిక జీవితంలో కూడా దిశానిర్దేశకులుగా చేస్తుంది.
2. వ్యక్తిగత జీవితంలో దేశభక్తి అభ్యాసం
దేశభక్తి కేవలం యుద్ధభూమికి సంబంధించిన విషయం కాదు. అది రోజువారీ జీవితంలో కూడా అంతే అవసరం, ముఖ్యం. తన విధులను నిజాయితీగా నిర్వర్తించడం, సమాజంపట్ల సంవేదన శీలత, స్వచ్చమైన క్రమశిక్షణాయుక్త, సంయమన జీవనశైలి, ఇవన్నీ దేశభక్తికి ప్రతిరూపాలే. ఒక పౌరుడు సరైన సమయంలో తనవంతు పన్ను చెల్లించినా, కష్టపడి పనిచేసినా, పౌర నియమాలను పాటించినా- అతను వాస్తవానికి తన పద్ధతిలో దేశాన్ని పటిష్టం చేస్తున్నట్లే.
3. అభివృద్ధి యొక్క భారతీయ భావన
భారతీయ దృక్పథంలో అభివృద్ధి కేవలం స్థూల దేశీయోత్పత్తి (GDP) లేదా మౌలిక సదుపాయాలకే పరిమితం కాదు. ఇది అత్మోన్నతి, సామాజిక న్యాయం, పర్యావరణ పరిరక్షణల సమతుల్య మిశ్రమం. అభివృద్ధి అనేది సమాజంలోని చివరి వ్యక్తి వరకు చేరేదిగా ఉండాలి. సహజ వనరులను పరిరక్షించి, పెంపొందించేదే సరైన అభివృద్ధి. వాస్తవమైన భారతీయ అభివృద్ధి. ఈ ఆలోచనే భారతదేశాన్ని ఒక స్థిరమైన, నైతిక, సమరస సమాజం వైపు నడిపిస్తుంది.
4. చరిత్ర మరియు భౌగోళిక అవగాహన అవసరం
భారతదేశ చరిత్ర కేవలం అధికారాల ఉత్థాన పతనాల కథ కాదు. అది విలువలు, జ్ఞానం, ఆత్మబలిదానాల గాథ. ఏ ప్రాంతం ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు ఎలా మారిందో, ఏ సంస్కృతి ఎలా ఉద్భవించిందో లేదా పతనం అయిందో మనం తెలుసుకోవాలి. భారతదేశం భౌగోళికంగా మన సంస్కృతికి, రాజకీయాలకు, వైవిధ్యాలకు నిదర్శనంగా ఉన్నది. ఈ అవగాహన మన వర్తమాన, భవిష్యత్ విధాన- నిర్ణయాలలో మూలాధారంగా నిలుస్తుంది.
5. భారతదేశ వైవిధ్యం మన అంతర్గత ఐక్యతకు ప్రతీక
భారతదేశం యొక్క అసలైన అందం దాని వైవిధ్యంలో దాగి ఉంది. భాష, వేషధారణ, ఆహారం, పండుగలు, పూజాపద్ధతులు అన్నీ వేరు వేరుగా కనిపించినప్పటికీ, వాటి మూలంలో ఒకే సాంస్కృతిక భావ వ్యక్తీకరణ ఉంటుంది. కొన్ని ప్రాంతాలు గర్భాతో ఆనందిస్తే, మరికొన్ని ఛర్ పూజలో శ్రద్ధతో నిండిపోతాయి. ఒకచోట బతుకమ్మలను పేర్చి ఆటలాడితే, మరొకచోట అట్లతద్ది పేరున ఆటలాడవచ్చు, ఊయలలూగవచ్చు. ఈ ఉత్సవాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వాటిలో పాలుపంచుకోవడం మన జాతీయ ఐక్యతకు బలం. ప్రతి భాష, ప్రతి ఉత్సవం భారతదేశాన్ని మరింత సుసంపన్నం చేస్తాయి. సర్వమత సమాదరణ ఈ భూమి యొక్క మూల భావన.
6. సామాజిక సమరసత, ఐక్యత, ఏకాత్మత, బంధుభావం
మానవులందరిలో ఒకే ఈశ్వరీయ తత్వం ఉందనే నమ్మకమే హిందూ దర్శనం యొక్క మూలమంత్రం. కావున కులం లేదా పుట్టుక ఆధారంగా వివక్ష చూపడం పూర్తిగా అనుచితం. ఈ ఏకత్వం మనల్ని ఒకరితో ఒకరిని సోదరభావంతో కలుపుతుంది. ఈ భావనతో జీవించేవారు సహజంగానే ఏకాత్మత అనుభూతిని చెంది జాతి ఐక్యతకు బలం చేకూర్చినవారవుతారు. ఈ ఏకాత్మ భావన కారణంగా, వ్యక్తి తన స్వార్థానికి అతీతంగా ఒక మంచి శీలవంతుడైన వ్యక్తిగా మారడానికి ప్రయత్నిస్తాడు.
7. శీల నిర్మాణం – దేశ స్థిరత్వానికి పునాది
శీలవంతులైన పౌరులు ఉన్నప్పుడే ఒక దేశం స్థిరంగా ఉంటుంది. స్వార్థంపై ఆధారపడిన సంస్థలు అలీబాబా నలభై దొంగలు కథ మాదిరిగా త్వరగా విచ్ఛిన్నమవుతాయి. కానీ వ్యక్తి చిన్నప్పటినుండి సత్యం, సేవ, సంయమనం, సమర్పణ అభ్యాసం చేస్తే, అతను ఒక మంచి పుత్రుడు, ఒక మంచి పౌరుడు, ఒక శక్తివంతమైన దేశ-నిర్మాత అవుతాడు. ఈ అభ్యాసం ఇంటి నుండి ప్రారంభమై, కుటుంబంతో కలిసి, సమాజం వరకు చేరుతుంది.
8. సజ్జనశక్తి సంఘటన మరియు జాగరూకత
నేడు సజ్జనులు కేవలం వ్యక్తిగత జీవితానికే పరిమితం కాకుండా, సంఘటితమై దేశ హితం కోసం ముందుకు రావలసిన అవసరం ఉంది. సమాజం మరియు దేశ రక్షణ కోసం సజ్జనుల సంఘటిత ప్రయత్నమే సాంస్కృతిక భద్రతా కవచంగా మారుతుంది. ‘సంఘే శక్తిః కలౌయుగే’ – కలియుగంలో సంఘటితత్వమే శక్తి.
9. ఆధునికతతో సంప్రదాయం యొక్క సమతుల్యత
నేడు మనం సాంకేతికతను స్వీకరించాలి. కొత్త వ్యవస్థలలో భాగం కావాలి. కానీ మన ధర్మం, సంస్కృతి, విలువల అవగాహనను ఎప్పటికీ కోల్పోకూడదు. అత్మబలంతో ముడిపడిన సంస్కృతి ఏ ఆధునికత కన్నా తక్కువ కాదు. ఇలాంటి సంస్కృతి అధునికతకు దిశానిర్దేశం చేస్తుంది కూడా. ఈ సమతుల్యతే భారతదేశాన్ని ప్రాచీనమైనదే కాకుండా, చిరంజీవి అయిన జాతిగానూ నిలబెడుతుంది.
10. దేశమే సర్వోన్నతం
భారతదేశ నియతి (విధి / Destiny) కేవలం భౌగోళిక ఉన్నతే కాదు, ఇది ఒక ఆధ్యాత్మిక, సాంస్కృతిక యాత్ర కూడా. మనం దేశాన్ని సర్వోన్నతంగా భావిస్తూ, ప్రతి తరంలోనూ “దేశానికి అగ్ర ప్రాధాన్యం, మిగతావన్నీ తర్వాతే” (Nation First Every-thing Next) అనే భావనను నెలకొల్పుతూ ఉండాలి. ఈ ఆలోచన, ఈ సంకల్పమే భారతదేశాన్ని రాబోయే యుగాలవరకు సమృద్ధంగా, శాంతియుతంగా, విశ్వహితైషి దేశంగా నిలబెడుతుంది.





