News

సంఘ్‌ను ఆధ్యాత్మిక సాధనగా చూసిన వ్యక్తి ‘‘మీనన్ సార్’’ : మోహన్ భాగవత్ జీ

175views

కేరళ ప్రాంత పూర్వ సంఘచాలక్ పీ.ఈ.బీ. మీనన్ శ్రద్ధాంజలి సభ కేరళలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మోహన్ భాగవత్ గారు మాట్లాడుతూ మీనన్ సంఘ్‌ను ఓ ఉద్యమంగా కాకుండా ఓ ఆధ్యాత్మిక సాధనగా చూశారన్నారు. మనం వ్యక్తులుగా ఎలా వుండాలో, సంఘ్‌ను కుటుంబంలా ఎలా చూసుకోవాలో, స్వయంసేవక్‌లు సంఘ్ కార్యాన్ని ఎలా చేయాలో కూడా చేసి చూపించారన్నారు.

మీనన్ సార్ చూపిన విలువలు మనతోనే ఎప్పటికీ నిలిచి వుంటాయని, వాటిని ఎప్పటికీ నెమరువేసుకోవడానికి, జ్ఞాపకాలుగా చెప్పుకోవడానికి ఉపయోగపడతాయన్నారు. మీనన్ గారు ఆలస్యంగా సంఘ్‌లోకి వచ్చినప్పటికీ, వచ్చినప్పటి నుంచీ సంఘ కార్యంలో పూర్తిగా మునిగిపోయారన్నారు. కేరళలోని సంఘ్ కార్యకర్తలకు మీనన్ సర్ స్ఫూర్తిదాయకమని మోహన్ భాగవత్ గారు నొక్కి చెప్పారు. అనేక సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలకు నాయకత్వం వహించారని, అందుకే మీనన్ సర్‌ను కేరళీయులు ఎప్పటికీ గుర్తుంచుకుంటారన్నారు.

కేరళ ప్రాంత సంఘచాలక్‌గా పనిచేసిన మీనన్ (88) ఈ నెల తొమ్మిదో తేదీన కన్నుమూశారు. వృత్తిరీత్యా సుప్రసిద్ధ చార్టర్డ్ అకౌంటెంట్. అయితే.. అందరూ ఈయనను మీనన్ సర్ అని పిలుచుకుంటారు. ఈ నెల 9 న అమృత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో కన్నుమూశారు.

దేశంలో ఎమర్జెన్సీ విధించిన సమయంలో అప్పటి సంఘ ప్రచారక్ మాధవ్ జీ ద్వారా మీనన్‌కి సంఘ్‌తో పరిచయం ఏర్పడింది. ఆ తర్వాత 1978 లో సంఘ శిక్షావర్గలో పాల్గొన్నారు. అదే యేడాదిలో ఆలువా జిల్లా సంఘచాలక్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత 1987 లో ఎర్నాకులం విభాగ్ సంఘచాలక్ అయ్యారు. 1997లో, మీనన్ సర్ సహ ప్రాంత సంఘచాలక్‌గా బాధ్యతలు స్వీకరించి 2003 వరకు కొనసాగారు. ఆ తర్వాత ప్రాంత సంఘచాలక్‌గా బాధ్యతలు స్వీకరించి, 2021 వరకూ కొనసాగారు. తదనంతరం ఆరోగ్య కారణాల రీత్యా వైదొలిగారు.