News

పూణేలోని కోట వద్ద ముస్లిం మహిళల నమాజ్.. గోమూత్రంతో శుద్ధి చేసిన బీజేపీ ఎంపీ

199views

చారిత్రక ప్రాధాన్యత కలిగిన పూణేలోని శనివార్ వాడ కోట ప్రాంగణంలో కొందరు ముస్లిం మహిళలు నమాజ్‌ చేస్తూ కనిపించిన వీడియో క్లిప్‌, మహారాష్ట్ర రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన అధికార బీజేపీ ఎంపీ మేధా కులకర్ణి నేతృత్వంలోని హిందూ సంస్థల బృందం, ఆ ప్రదేశాన్ని ‘శుద్ధి’ చేసేందుకు ప్రయత్నించడంతో వివాదం మరింత రాజుకుంది.

నమాజ్ చేసిన ప్రదేశాన్ని ఎంపీ మేధా కులకర్ణి, ఇతర హిందూ సంఘాల నాయకులతో కలిసి ఆ ప్రదేశాన్ని గోమూత్రంతో శుద్ధి చేసి శివ స్తుతి నిర్వహించారు. “శనివార్ వాడ కేవలం ఒక కోట కాదు, ఇది మరాఠా సామ్రాజ్యానికి, ప్రతీ పుణెకర్‌కు గర్వకారణమని భావోద్వేగాల కేంద్రమని అలాంటి చోట నమాజ్ చేయడం దురదృష్టకరమని కులకర్ణి వ్యాఖ్యానించారు. మహారాష్ట్ర మంత్రి నితేష్ రాణే కూడా ఈ ఘటనను ఖండించారు.

శనివార్ వాడ కోట హిందూ సమాజానికి పవిత్రమైనదని, ప్రార్థనలు చేయాలంటే మసీదులకు వెళ్లాలని సూచించారు. హజీ అలీ వంటి ముస్లిం పుణ్యక్షేత్రాల్లో హిందువులు హనుమాన్ చాలీసా లేదా హారతి చేస్తే ముస్లింల మనోభావాలు దెబ్బతినవా అని ఆయన ప్రశ్నించారు.