
గ్రామీణ అభివృద్ధి రంగంలో విశిష్ట సేవలందించినందుకు శ్రీకాకుళం జిల్లా మరియు పార్వతీపురం మన్యం జిల్లా పరిధిలోని కొత్తూరు, భామిని మండలాల మారుమూల గ్రామాల్లో గత 16 సంవత్సరాలుగా నిరంతర గ్రామ వికాస కార్యక్రమాలు నిర్వహిస్తున్న గ్రామీణ వికాస్ సంఘానికి సంత్ ఈశ్వర్ ఫౌండేషన్ జాతీయ స్థాయి పురస్కారం లభించింది.
న్యూఢిల్లీ లో అక్టోబర్ 5న జరిగిన సంత్ ఈశ్వర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన అవార్డు ప్రధాన ఉత్సవంలో కేంద్ర మంత్రులు శ్రీ శివరాజ్ సింగ్ గారు, శ్రీ భూపేంద్ర యాదవ్ గారు మరియు ఆర్‌ఎస్‌ఎస్ సర్ కార్యవాహ్ శ్రీ దత్తాత్రేయ హోసబలే గారి చేతుల మీదుగా గ్రామీణ వికాస్ సంఘం ప్రతినిధులు, కార్యదర్శి మజ్జి ఈశ్వరరావు, సంఘటనా కార్యదర్శి రాజేంద్ర స్వీకరించారు.
ఈ పురస్కారం క్రింద సంఘానికి రూ.1,00,000 నగదు బహుమతిని కూడా అందజేశారు. గ్రామీణ వికాసం పట్ల సంఘం చూపుతున్న అంకితభావం, గ్రామస్థుల భాగస్వామ్యంతో సుస్థిర అభివృద్ధి దిశగా చేస్తున్న ప్రయత్నాలు ఈ గుర్తింపుకు కారణమయ్యాయని నిర్వాహకులు తెలిపారు.

గ్రామీణ వికాస్ సంఘం జాతీయ స్థాయి పురస్కారం అందుకునే స్థాయికి ఎదగడంలో ప్రారంభం నుంచే పౌష్టికాహారం మరియు ఉచిత ట్యూషన్ సెంటర్ల నిర్వహణకు ఆర్థిక సహకారం అందించిన హైదరాబాద్‌కు చెందిన MCKS Food for the Hungry Foundation కు సంఘం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తుంది.
అలాగే సంఘ భవన నిర్మాణానికి ఆర్థిక సహాయం అందించిన మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని), హైదరాబాద్ వారికి మరియు డా. హెడ్గేవార్ శతజయంతి సేవా సమితి, విజయవాడ, జన సేవా నిధి, హైదరాబాద్ సంస్థలకు కూడ సంఘం కృతజ్ఞతలు తెలియజేసింది.
ఈ ప్రయాణంలో ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపింది.





