News

పాక్‌ మహిళకు రక్షణశాఖ రహస్యాలను చేరవేస్తున్న వ్యక్తి అరెస్ట్

144views

వలపు వలలో పడి రాజస్థాన్‌కు చెందిన మంగత్‌ సింగ్‌ అనే వ్యక్తి పాక్‌ మహిళకు భారత రక్షణశాఖ రహస్యాలను చేరవేశాడు. చివరికి రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అధికారులకు చిక్కి జైలుపాలయ్యాడు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ -ISI కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలతో రాజస్థాన్ ఇంటెలిజెన్స్ అల్వార్‌కు చెందిన మంగత్‌ సింగ్‌ని అరెస్టు చేసింది.

రెండేళ్ల క్రితం సోషల్‌ మీడియాలో పాక్‌కు చెందిన ఇషాశర్మతో మంగత్‌ సింగ్‌కు పరిచయం ఏర్పడింది. దీంతో ఆమె కోసం సైన్యం, రక్షణ సంస్థలకు చెందిన కీలక సమాచారాన్ని సేకరించి తెలియజేసేవాడు. అల్వార్‌ కంటోన్మెంట్ ఏరియా, ఇతర రక్షణరంగ వ్యూహాత్మక కేంద్రాలపై పాక్‌కు అతడు సమాచారం ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించామని అధికారులు పేర్కొన్నారు. దీనిపై సెంట్రల్ ఎంక్వైరీసెంటర్‌లో వివిధ నిఘాసంస్థలు విచారణ జరుపుతున్నాయన్నారు.

ఇదేవిధంగా రాజస్థాన్‌లోని జైసల్మేర్‌కు చెందిన మహేంద్ర ప్రసాద్ అనే వ్యక్తిని సీఐడీ (భద్రత) నిఘా విభాగం అరెస్టు చేసింది. చందన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లోని డీఆర్‌డీఓ గెస్ట్ హౌస్ మేనేజర్‌గా పనిచేసే మహేంద్ర పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ (ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్) కోసం గూఢచర్యం చేస్తున్నారనే ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. పాక్‌కు గూఢచర్యం చేసేవారు దేశంలో ఏ మూలన ఉన్నా.. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి నిఘా సంస్థలు నిరంతరం అప్రమత్తంగా పనిచేస్తున్నాయని సీఐడీ అధికారులు పేర్కొన్నారు.