News

బరేలీలో ‘‘ఐ లవ్ మహ్మద్ ర్యాలీ…’’ పోలీసులపైకి రాళ్ల వర్షం

175views

‘‘ఐ లవ్ మహ్మద్’’ పోస్టర్ దేశమంతా వివాదం రాజేస్తోంది. చాలా చోట్ల తీవ్ర నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. తాజాగా యూపీలోని బరేలీ భగ్గుమంది. శుక్రవారం ప్రార్థనల తర్వాత పెద్ద ఎత్తున గుమిగూడి పోలీసులపై రాళ్లు రువ్వారు. దీంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జీ చేశారు.

ఐ లవ్ మహమ్మద్’ ప్రచారానికి మద్దతుగా ప్రదర్శన నిర్వహించేందుకు స్థానిక మౌలానా, ఇత్తెహాద్-ఎ-మిల్లత్ కౌన్సిల్ చీఫ్ మౌలానా తౌకీర్ రజా పిలుపునిచ్చారు. దీంతో శుక్రవారం ప్రార్థనలు ముగియగానే ఆ వర్గానికి చెందిన ప్రజలు పెద్దఎత్తున బరేలిలోని ఇస్లామిక్ గ్రౌండ్ సమీపంలో గుమిగూడారు. ముందస్తుగా పోలీసులు భారీగా మోహరించారు. కొందరు అభ్యంతరకరమైన నినాదాలు చేయడంతోపాటు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. దీంతో పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ జరిపారు.

మరోవైపు పోలీసులపై రాళ్ల దాడి విషయం పోలీసు శాఖ సీరియస్ గా తీసుకుంది. రాళ్లు రువ్విన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనికి సంబంధించిన వీడియోలు రికార్డు అయ్యాయని, కచ్చితమైన చర్యలు వుంటాయని పోలీసులు ప్రకటించారు. మరోసారి ఇలాంటివి పునరావృత్తం కాకుండా చూస్తామని బరేలీ డీఐజీ ప్రకటించారు.

‘‘కొంత మంది దుర్మార్గులు నినాదాలు చేస్తూ పోలీసులపైకి రాళ్లు రువ్వారు. దీంతో తాము లాఠీఛార్జి చేశాం. కొంత మందిని అరెస్ట్ కూడా చేశాం. ఎఫ్ఐఆర్ లు నమోదు చేస్తున్నాం.జనాలు బ్యానర్లతో, రాళ్లతో బయటకు రావడం ముందస్తు ప్రణాళికలో భాగమే. సంఘటనకు సంబంధించిన వీడియోలు, చిత్రాల ఆధారంగా పాల్గొన్న వారందరినీ గుర్తించి, వారిపై చర్యలు తీసుకుంటాం’’ అని పేర్కొన్నారు.

కర్నాటకలోనూ గొడవలు…
కర్ణాటకలోని దావణగెరెలో ఒక ముస్లి వర్గాలు పెట్టిన ఫ్లెక్సీ బ్యానర్ తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీంతో రెండు వర్గాల మధ్య దాడులు జరిగాయి. ఈ ఘటనలో ఒక బాలిక గాయపడగా, కొన్ని ఇళ్ల తలుపులు ధ్వంసమయ్యాయి. పోలీసులు సత్వరమే స్పందించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. దావణగెరెలోని కార్ల్ మార్క్స్ నగర్‌లో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

‘ఐ లవ్ మహమ్మద్’ అని రాసి ఉన్న ఒక ముస్లింలు ఏర్పాటు చేశారు. ఈ బ్యానర్‌ను వెంటనే తొలగించాలని హిందువులు కోరారు. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం ముదిరింది. కొద్దిసేపటికే ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. అల్లర్ల సమయంలో, కొంతమంది ముస్లింలు కేవలం ‘హిందూ ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లు రువ్వారు. ఈ దాడిలో ఒక బాలికకు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఆజాద్ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. పోలీసులు వివాదాస్పద బ్యానర్ ను తొలగించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని దావణగెరె ఎస్పీ ఉమా ప్రశాంత్ తెలిపారు.

కాగా, రెండు వారాల క్రితం మండ్య జిల్లాలోని మద్దూరులో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. గణేష్ విగ్రహ నిమజ్జనం సందర్భంగా రెండు వర్గాల మధ్య రాళ్ల దాడి జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు 21 మందిని అరెస్టు చేశారు