ArticlesNews

కర్రల సమరం కాదు.. ‘బన్ని’ఉత్సవం

249views

కర్నూలు జిల్లా దేవరగట్టులో ప్రతి ఏటా నిర్వహించే దసరా బన్ని ఉత్సవంలో నెరణికి, నెరణికి తండా, కొత్తపేట గ్రామస్తులు ఐక్యతను చాటుకుంటూ వస్తున్నారు. ప్రత్యేక దీక్ష చేపట్టి వేడుకను వైభవంగా జరుపుకుంటున్నారు. అక్టోబర్‌ 6వ తేదీ వరకు జరిగే దసరా ‘బన్ని’ఉత్సవాలకు సిద్ధమవుతున్నారు. ఈ మూడు గ్రామాలకు చెందిన కొందరు యువకులు గత నాలుగేళ్ల నుంచి మల్లయ్య మాల దీక్షను చేపట్టి భక్తిని చాటుతున్నా రు. అయ్యప్ప, శివయ్య మాల దీక్ష వలే కొన్నేళ్ల నుంచి మల్లయ్య మాల ధరిస్తుస్తున్నారు. మూడు గ్రామాల్లో మల్లయ్య దీక్ష చేపట్టే భక్తుల సంఖ్య ఏటా పెరుగుతోంది. కఠోర దీక్షను పాటిస్తూ తమ ఇలవేల్పుపై భక్తిని చాటుకుంటున్నారు. దేవరగట్టు దసరా బన్ని మహోత్సవాల్లో ఈ మూడు గ్రామాస్తులదే కీలక భూమిక. అమావాస్య నుంచి దీక్షను మొదలు పెట్టి బన్ని ఉత్సవాలు ముగిసేంత వరకు నిష్టతో ఉంటారు. విగ్రహాలు తిరిగి నెరణికి గ్రామానికి చేరే వరకు కట్టుబాట్లను తూచ తప్పకుండా పాటిస్తారు. ఈ 15 రోజుల పాటు చెప్పులు తొడుక్కోరు. అలాగే దాంపత్య సుఖానికి పూర్తిగా దూరంగా ఉంటారు. ఇక మద్యం జోలికెళ్లరు. మాంసం ముట్టరు. దైవకార్యాన్ని విజయవంతంగా పూర్తి చేయాలనే లక్ష్యంతో పండుగను జరుపుకుంటారు. ఎంత కక్షలు ఉన్నా బన్ని రోజు అన్నదమ్ముల్లా కలిసి మెలసి ఉందామని పాలబాస తీసుకుంటారు.

మూడు గ్రామాల్లో ఆరోజే దసరా..
ఈ ఏడాది దేశమంతా అక్టోబర్‌ 2వ తేదీ దసరా వేడుకలు జరుపుకుంటే ఈ మూడు గ్రామంలో 6వ తేదీన చేసుకుంటారు. విజయదశమి నాడు అందరికీ దసరా పండుగా అయితే ఆ మూడు గ్రామస్తులకు మాత్రం బన్ని ఉత్సవాలు ముగిసి విగ్రహాలు నెరణకి గ్రామానికి చేరే రోజు విజయానికి సూచికగా వారు పండుగ చేసుకుంటారు. ఈ కట్టుబాట్లను కులమత భేదాలు లేకుండా అన్ని వర్గాల వారు పాటిస్తూ ఉత్సవంలో భాగస్వాములవుతారు. ఉత్సవాలు ముగిసేంత వరకు ఒకరినొకరు కొట్టుకోరు. ఒకరినొకరు తిట్టుకోరు. వాళ్ల లక్ష్యం ఒక్కటే. మాళమల్లేశ్వరుల విగ్రహాన్ని విజయవంతంగా నెరణికికి చేర్చడం. మనస్సు నిండా భక్తిని నింపుకుని నిష్టతో, నిబద్ధతతో ఉంటారు. కట్టుబాట్లను పాటిస్తున్నందునే బన్ని (కర్రల సమరం)లో దేవరగట్టు చుట్టు పక్క ఉన్న మిగిలిన గ్రామాలకు చెందిన భక్తులు వేలాది సంఖ్యలో పాల్గొన్నా జైత్రయాత్రాన్ని విజయవంతంగా ముగించుకుని విగ్రహాలను నెరణికి గ్రామం చేరుస్తున్నామని మూడు గ్రామస్తు ల నమ్మకం. తమ గ్రామాల్లో ఇన్నాళ్లు ఒకరికొకరు ఎలా ఉన్నా ఉత్సవంలో మాత్రం కలిసికట్టుగా ఉండి తమ మధ్య విధించుకున్న కట్టుబాట్లకు కట్టుబడి ఉంటారు.

నిష్టతో కట్టుబాట్లను పాటిస్తారు
దేవరగట్టు ఉత్సవాల్లో మూడు గ్రామస్తులు నిష్టతో కట్టుబాట్లు పాటిస్తారు. ఇక బన్ని రోజు రెండుసార్లు స్నానం చేస్తారు. సాయంత్రం గట్టుకెళ్లే ముందు ప్రతి ఒక్కరు స్నానమాచారిచి గ్రామంలోని గుడిలకు వెళ్లి టెంకాయలు సమర్పిస్తారు. అనంతరం తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని కొండకు బయలుదేరుతారు. బన్నిలో ఏ ఒక్కరు మద్యం తాగరు, మాంసం ముట్టరు. తాగి కర్రలతో విగ్రహాల దగ్గరకు వచ్చే వారిని కట్టడి చేసి విగ్రహాలకు రక్షణ కల్పించడమే లక్ష్యంగా జైత్రయాత్రలో పాల్గొంటారు.– రవిశాస్త్రి, మాళమల్లేశ్వరునికి కల్యాణం జరిపే పురోహితుడు, నెరణికి

కర్రలతో కొట్టుకోరు..
దేవరగట్టు బన్ని ఉత్సవంలో భక్తులు కర్రలతో కొట్టుకుంటారనేది అవాస్తవం. ఉత్సవాన్ని కర్రల సమరంగా చెప్పడం భావ్యం కాదు. పూర్వం గట్టు మీదకెక్కడానికి దివిటీలు, జంతువుల నుంచి రక్షణగా కర్రలు, ఆయుధాలు తీసుకెళ్లే వారు. కాలక్రమేణా అవి దురుద్దేశాలకు వాడడంతో కర్రల సమరంగా ముద్ర పడింది. మద్యం సేవించిన వారు మాత్రమే గాయ పడుతారు తప్ప ఇతరులకు గాయాలు కావు. విచక్షణ కోల్పోయి కొట్టుకోవడం వల్ల గతంలో చనిపోయారు. ఇప్పుడు తగ్గిపోయాయి. ఇదొక సంప్రదాయ పండుగ. – గిరిస్వామి,భవిష్యవాణి వినిపించే ఆలయ పూజారి