News

సరస్వతీదేవిగా దుర్గమ్మ

246views

సరస్వతి! నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా |
పద్మపత్రవిశాలాక్షి! పద్మకేసరవర్ణిని
నిత్యం పద్మాలయా దేవి సా మాం పాతు సరస్వతి ॥

శరన్నవరాత్రి మహోత్సవములలో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అలంకారములో దర్శనమిస్తున్నారు. మూలా నక్షత్రం శ్రీఅమ్మవారి జన్మనక్షత్రము. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తిస్వరూపాలతో దుష్టసంహారం చేసిన శ్రీదుర్గాదేవికి శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలానక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయిన సరస్వతీ అవతారంలో భక్తులను అనుగ్రహిస్తారు. సరస్వతీదేవిని సేవించడం వలన విద్యార్థినీ విద్యార్థులు సర్వవిద్యలలో విజయం పొందుతారు. మూలానక్షత్రం నుండి విజయదశమివరకు విశేష పుణ్య దినాలుగా భావించి భక్తులు శ్రీదుర్గమ్మను ఆరాధిస్తారు. భక్తజనుల అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని శ్రీ సరస్వతీదేవి. శ్రీ సరస్వతీదేవి దర్శనం అఖిల విద్యాభ్యుదయ ప్రదాయకము.

దసరా ఉత్సవాల్లో కీలకమైన మూలానక్షత్రం సందర్భంగా దుర్గమ్మ సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తున్న. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలివస్తున్నారు. భక్తులను పోలీసులు కంపార్ట్‌మెంట్‌లలో ఉంచి క్యూలో పంపుతున్నారు. దర్శనం చేసుకున్న వారిని త్వరగా దిగువకు పంపుతున్నారు. రద్దీని క్రమబద్ధీకరించేందుకు హోల్డింగ్‌ ఏరియాలను ఏర్పాటు చేశారు. నగరంలోని వినాయకగుడి, కుమ్మరిపాలెం నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చారు. నేడు టికెట్‌ దర్శనాలను రద్దు చేసి వేకువజామున 3 గంటల నుంచే అందరికీ సర్వదర్శనం కల్పించారు. నేడు 3 లక్షలకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.