News

కూచిపూడి అభివృద్ధికి చర్యలు

248views

కూచిపూడి గ్రామాన్ని ఆధ్యాత్మిక, సాంస్కృతిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను కృష్ణా జిల్లా కలెక్టర్‌ డి.కె.బాలాజీ ఆదేశించారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో కూచిపూడి గ్రామ అభివృద్ధిపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.

కలెక్టర్‌ బాలాజీ మాట్లాడుతూ.. రాష్ట్రీయ గ్రామీణ స్వచ్ఛ అభియాన్‌ కింద కూచిపూడి అభివృద్ధి పనులకు నిధులు మంజూరయ్యాయని, వీటికి ప్రతిపాదనలు తయారుచేసి సమర్పించాలని ఆదేశించారు. పామర్రు నుంచి కూచిపూడి, కళాక్షేత్రం యూనివర్సి టీకి చేరుకునే ఐలూరు రహదారుల అభివృద్ధికి తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామంలోని డ్రెయినేజీకి మరమ్మతులు చేపట్టాలని, అందుకోసం ఉపాధి హామీ నిధులు మంజూరు చేస్తామని సూచించారు.

రెగ్యులర్‌ నృత్య కోర్సులతో పాటు సెలవు రోజుల్లో వారం, నెలల షార్ట్‌ కోర్సులు నిర్వహించేలా చూడాలని, దీని వల్ల ఎక్కువ మందిని ఆకర్షించడానికి అవకాశం ఉంటుందని వివరించారు. గతంలో కూచిపూడి నృత్యం నేర్చుకుని ఉన్నత స్థానంలో ఉన్న ప్రముఖులను గుర్తించి కళాక్షేత్రం అభివృద్ధికి సహకారం కోరాలని అధికారులకు సూచించారు. కూచిపూడి గ్రామ మహిళలు తయారుచేసి నృత్య దుస్తులు, జడలు, గజ్జలు తదితర వస్తువులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించే విధంగా అధికారులు దృష్టిసారించాలని పేర్కొన్నారు. కళాక్షేత్ర యూనివర్సిటీకి ఉపకులపతిని నియమించాలని ఫోన్‌ ద్వారా కలెక్టర్‌ ఉన్నతాధికారులను కోరారు.