
న్యూఢిల్లీ: హిందూ ఆలయాలు, అర్చకులు, సనాతన ధర్మానికి సంబంధించిన వ్యవస్థలపై ఆల్ ఇండియా స్టూడెంట్ అసోసియేషన్ (AISA) నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా వివాదానికి దారితీశాయి. హిందూ ధార్మిక వ్యవస్థను కించపరిచేలా ఆమె వ్యాఖ్యలు ఉన్నాయంటూ బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆలయాలు, అర్చకులపై ఆధారాలు లేని సాధారణీకరణలు చేయడం సరికాదని విమర్శించింది.
మహిళలకు రక్షణ కల్పించాల్సిన అవసరం ఉందని, ముఖ్యంగా బ్రాహ్మణీయ వ్యవస్థ నుంచి వారిని కాపాడాలని నేహా బోరా వ్యాఖ్యానించారు. ఆలయాల్లో పూజారులు అత్యాచారాలకు పాల్పడుతున్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు వివాదానికి కారణమయ్యాయి. ఈ వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
నేహా బోరా వ్యాఖ్యలు గతంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తున్నాయని బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ విమర్శించారు. హిందూ దేవాలయాలకు వెళ్లే వారే మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారంటూ రాహుల్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. 2014లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన నేపథ్యంలో రాహుల్ చేసిన వ్యాఖ్యలతో నేహా బోరా వ్యాఖ్యలకు పోలిక ఉందని ఆరోపించారు.
హిందూ ధర్మంపై గత వ్యాఖ్యలను ప్రస్తావించిన బీజేపీ
గతంలో కాంగ్రెస్ నాయకులు ఉపయోగించిన ‘హిందూ ఉగ్రవాదం’, ‘కాషాయ ఉగ్రవాదం’ వంటి పదాలను కూడా ప్రదీప్ భండారీ ప్రస్తావించారు. 2010-2013 మధ్య యూపీఏ ప్రభుత్వ హయాంలో అప్పటి కేంద్ర మంత్రులు పి. చిదంబరం, సుశీల్ కుమార్ షిండే చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.
నేహా బోరా వ్యాఖ్యలు బంగ్లాదేశ్‌లోని ఇస్లామిస్ట్ భావజాలం నుంచి ప్రేరణ పొందినవిగా ఉన్నాయని భండారీ ఆరోపించారు. కాంగ్రెస్ రాజకీయాల్లో హిందూ వ్యతిరేక, సనాతన ధర్మ వ్యతిరేక భావజాలం కనిపిస్తోందని విమర్శించారు.
సనాతన ధర్మంపై విమర్శలే లక్ష్యంగా రాజకీయాలా?
హిందూ ఆలయాలు అనేవి కేవలం ప్రార్థనా స్థలాలు మాత్రమే కాదు.. కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి, ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకలు. అర్చకులు ఆలయాల్లో ఆగమ, వైదిక సంప్రదాయాలను అనుసరిస్తూ దైవారాధన నిర్వహిస్తారు. ఏదైనా వ్యక్తి లేదా వ్యవస్థలో తప్పులు ఉంటే వాటిని ఆధారాలతో ప్రశ్నించవచ్చు. అయితే కొందరి చర్యలను మొత్తం హిందూ ధార్మిక వ్యవస్థకు ఆపాదించడం, ఆలయాలు మరియు అర్చకులపై సాధారణీకరణలు చేయడం సమంజసం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.





