News

దీపావళి వేళ.. ఢిల్లీలో గ్రీన్‌ క్రాకర్స్‌కు ‘సుప్రీం’ అనుమతి

25views

దీపావళి పండగ నేపథ్యంలో ఢిల్లీలో – ఎన్‌సీఆర్‌ పరిధిలో గ్రీన్‌ క్రాకర్స్‌ కాల్చేందుకు సుప్రీంకోర్టు అనుమతించింది. నవంబర్ 7, 8వ తేదీల్లో ఉదయం 6 నుంచి 7 గంటల వరకు, రాత్రి 8 నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతించాలని అధికారులను ఆదేశించింది. ఆసుపత్రులు, నర్సింగ్‌ హోంలు, వృద్ధాశ్రమాలు, నోటిఫైడ్‌ సైలెన్స్‌ జోన్లకు 300 మీటర్ల పరిధిలో టపాసులు కాల్చొద్దని స్పష్టం చేసింది. బాణసంచా పరిశ్రమలకు గ్రీన్ క్రాకర్ల తయారీకి మాత్రమే అనుమతి ఉందని పేర్కొంది.

బేరియం కలిగిన బాణసంచా వాడకం, CSIR-NEERI ఆమోదించని గ్రీన్‌ క్రాకర్లకు అనుమతి లేదని జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌, జస్టిస్‌ పి.బి.వరాలే ధర్మాసనం పునరుద్ఘాటించింది. అదేవిధంగా దిల్లీ-ఎన్‌సీఆర్‌ పరిధిలో అక్రమ, కాలుష్యకారక టపాసుల దిగుమతులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించింది. గతంలో విధించినట్లుగానే.. దిల్లీ-ఎన్‌సీఆర్ పరిధిలో టపాసులపై పూర్తి నిషేధాన్ని నవంబర్ 9 నుంచి తిరిగి అమలు చేయాలని అక్టోబర్ 29 నాటి తమ ఉత్తర్వుల్లో పేర్కొంది. సోమవారం ఈ ఉత్తర్వులు అందుబాటులోకి వచ్చాయి.