News

శబరిమల అయ్యప్ప భక్తులకు రూ.2 లక్షల జీవిత బీమా

29views

శబరిమల అయ్యప్పస్వామి దర్శనానికి వచ్చే భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) శుభవార్త అందించింది. యాత్రికుల భద్రత, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించే ఉద్దేశంతో తొలిసారిగా ప్రత్యేక జీవిత బీమా పథకాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. యాత్ర సమయంలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే భక్తుల కుటుంబాలకు రూ.2 లక్షల బీమా పరిహారం అందించనుంది.

నవంబరు 17 నుంచి ప్రారంభం కానున్న శబరిమల మండల-మకరవిళక్కు యాత్రా సీజన్ నేపథ్యంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు ఈ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకాన్ని భారత జీవిత బీమా సంస్థ (ఎల్‌ఐసీ) సహకారంతో అమలు చేయనున్నట్లు టీడీబీ అధ్యక్షుడు కె. జయకుమార్ వెల్లడించారు.

ఈ బీమా పథకానికి సంబంధించిన ప్రీమియం మొత్తాన్ని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు తన సంక్షేమ నిధి నుంచి చెల్లించనుంది. ఇందుకోసం ఒక్కో యాత్రా సీజన్‌కు గరిష్ఠంగా రూ.కోటి వరకు ఖర్చు చేసే అవకాశం ఉందని బోర్డు తెలిపింది. భక్తులపై అదనపు ఆర్థిక భారం పడకుండా దేవస్థానం బోర్డే బీమా ప్రీమియం బాధ్యతను తీసుకోవడం విశేషం.

శబరిమల అయ్యప్పస్వామి దర్శనం కోసం ఆన్‌లైన్‌లో సమయాన్ని బుక్ చేసుకునే సమయంలోనే భక్తుల వివరాలతో పాటు వారి నామినీ వివరాలను కూడా సేకరించనున్నారు. తద్వారా యాత్ర సమయంలో అనుకోని ప్రమాదం జరిగి భక్తుడు మరణిస్తే, సంబంధిత నామినీకి బీమా పరిహారం అందించేలా ఏర్పాట్లు చేయనున్నారు.

ప్రతి ఏటా లక్షలాది మంది అయ్యప్ప భక్తులు కఠినమైన నియమాలు పాటిస్తూ ఇరుముడితో శబరిమల యాత్ర చేపడుతుంటారు. కొండ మార్గాల్లో నడక, రద్దీ, ప్రయాణ కష్టాలు వంటి పరిస్థితుల నేపథ్యంలో యాత్రికుల భద్రతకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఇలాంటి సమయంలో ప్రమాదవశాత్తు భక్తులు ప్రాణాలు కోల్పోతే వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఈ బీమా పథకం ఉపయోగపడనుంది.