News

ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక యాత్రలు

222views

సీనియర్‌ సిటిజన్లు ఆధ్యాత్మిక ప్రాంతాలను తిలకించాలన్న కోరికను తీర్చేందుకు ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఐఆర్‌సీటీసీ) ఆధ్వర్యంలో ప్రత్యేక యాత్రా ఏర్పాట్లు చేసినట్లు ఆ సంస్థ ఏరియా మేనేజర్‌ ఎం.రాజు చెప్పారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన యాత్రా విశేషాలను వివరించారు.

ఈ నెల 23వ తేదీ నుంచి జ్యోతిర్లింగ దివ్య దక్షిణ యాత్ర ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ ప్రత్యేక రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరి విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు మీదుగా తిరువణ్ణామలైలోని అరుణాచలం దేవాలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి దేవాలయం, మధురై మీనాక్షి అమ్మన్‌ ఆలయం, కన్యాకుమారి రాక్‌ మెమోరియల్‌, భగవతి (కుమారి) అమ్మన్‌ ఆలయం, త్రివేండ్రంలోని పద్మనాభస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వరాలయానికి 30వ తేదీకి చేరుకుంటుందని తెలిపారు. ఈ యాత్ర మొత్తం 7 రాత్రులు 8 రోజులు కొనసాగుతుందన్నారు. రూ.14,100 నుంచి టికెట్‌ ధర మొదలవుతుందని, థర్డ్‌ ఏసీ రూ.22,500, సెకండ్‌ ఏసీ రూ.29,500 ఉంటుందని తెలిపారు.

అక్టోబర్‌ 7వ తేదీన తిరుపతి రేణిగుంటలో భవ్య గుజరాత్‌ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఇది నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా ప్రయాణిస్తుందన్నారు. ద్వారకాలోని ద్వారకాధీష్‌ ఆలయం, నాగేశ్వర్‌ టెంపుల్‌, ద్వారకా, సోమనాథ్‌లోని సోమనాథ్‌ ఆలయం, అహ్మదాబాద్‌లోని సబర్మతి ఆశ్రమం, మోధేరా సూర్య దేవాలయం, రాణికి వాప్‌, ఏక్తా నగర్లోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహమైన స్టాట్యూ ఆఫ్‌ యూనిటీకి చేరుకుంటుందన్నారు. మొత్తం 9 రాత్రులు, 10 రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని తెలిపారు. దీనికి స్లీపర్‌, థర్డ్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ సౌకర్యం ఉందని, స్లీపర్‌ క్లాస్‌ పెద్దలకు రూ.18,400తో టికెట్‌ ప్రారంభమవుతుందన్నారు. థర్డ్‌ ఏసీ రూ.30,200, సెకండ్‌ ఏసీ రూ.39,900 ఉంటుందని వివరించారు. ఈ ప్యాకేజీలోనే ఉదయం టీ, అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజన వసతి ఉంటుందన్నారు.

రైలులోని ప్రతి కోచ్‌లోనూ ఒక సెక్యూరిటీ గార్డు ఉంటారని, సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందన్నారు. వీటితోపాటుగా యాత్రలో ప్రదేశాల వద్దకు చేరుకునేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక బస్సు సౌకర్యం కూడా ఈ ప్యాకేజీలోనే ఏర్పాటు చేశామన్నారు. టికెట్‌ రిజర్వ్‌ చేసుకునేందుకు విజయవాడలోని ఐఆర్‌సీటీసీ నంబర్లు 9281495848, 9281030714కు ఫోన్‌ చేయాలని కోరారు. సమావేశంలో అసిస్టెంట్‌ మేనేజర్‌ జయంత్‌ ఠాకూర్‌ తదితరులు పాల్గొన్నారు.