ArticlesNews

అనన్య శిల్పి విశ్వకర్మ

247views

విశ్వకార్మికతకు మూలపరుషుడు విశ్వకర్మ. సర్వవృత్తులకు నాందీ ప్రస్తావన పలికిన ఆయనను రుగ్వేద, కృష్ణయజుర్వేదాలు సృష్టికర్తగా పరిగణిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి సంవత్సరం సూర్యభగవానుడు సింహరాశి నుంచి కన్యారాశిలోకి ప్రవేశించే సమయంలో విశ్వకర్మ జయంతిని జరుపుకొంటారు. ఆంగ్లమాసం ప్రకారం, సెప్టెంబరు 17న విశ్వకర్మజయంతిని పాటిస్తున్నారు.

త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని కుమారుడు విశ్వకర్మ. స్వయం భూమన్వం తరంలో దేవతా శిల్పిగా చెప్పే ఆయన సమస్త కళలకు, వస్తువుఅకు మూల పురుషుడు. వాస్తు (నిర్మాణ) శాస్త్ర స్థాపకుడు. తన హస్త నైపుణ్యం, బుద్ధి కుశలతతో వివిధ రకాల వస్తువులు తయారుచేశాడు.. సామాజిక జీవన సిద్ధాంత దృష్ట్యా ఆయన ఆదర్శ పురుషుడు. ముల్లోకాలను గడగడలాడించిన వృతాసురుడిని (విశ్వకర్మ కుమారుడు) సంహరించేందుకు ఆయుధం కరవై, దేవగణం ఎటూ పాలుపోని స్థితిలో ఉండగా, నూతన ఆయుధాన్ని సృజించిన మహనీయుడు విశ్వకర్మ. లోకకల్యాణానికి కుమారుడి వధ కోసం ఆయుధం (వజ్రాయుధం) నిర్మించిన మహత్తర త్యాగశీలి. లోక శ్రేయస్సు కోసం దధీచి మహాముని ప్రాణత్యాగం చేయగా, ఆయన వెన్నెముకతో విశ్వకర్మ ఈ ఆయుధాన్ని రూపొందించాడు. అపూర్వ శిల్పి.ఆ సత్యయుగంలో దేవతల నివాసం కోసం స్వర్గలోకం, త్రేతాయుగంలో సువర్ణ లంకను, ద్వాపరయుగంలో ద్వారకానగరాన్ని, హస్తినాపురం, ఇంద్రప్రస్తం నిర్మించాడు. నాటి సమాజంలో కులవృత్తులన్నీ సమానమేనని చాటి చెప్పాడు.

దేశంలో సంపద పెరగాలంటే వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉత్పత్తి పెరగాలి. అది కార్మికుల చేతుల్లో ఉంది. విశ్వకర్మ స్ఫూర్తితో కృషి చేయాలి. కార్మికులు కేవలం జీతభత్యాల కోసమే పనిచేస్తున్నామనే భావన సరైనది కాదు. తన శ్రమ ద్వారా ఉత్పత్తిని పెంచుతూ సమాజంలోని అన్ని వర్గాలకు అవసరమైన అన్ని వస్తువులు అందిస్తున్నామనే భావన అలవరచుకోవాలి. శక్తివంచనలేకుండా పాటుపడుతూ కుటుంబపోషణకుతిగిన ప్రతిఫలం కోరుకోవాలి. అవసరమైతే ఉద్యమించాలి తప్ప తనసమయాన్ని, కష్టాన్ని కేవలం డబ్బుకు అమ్ముకొనే స్థితికి చేరకూడదు.

విశ్వకర్మను ఆరాధించే హస్తకళాకారులు ఆయన జయంతి రోజున తమ పని ముట్లను పూజిస్తారు. ఈ పవిత్రమైన రోజున వాటిని ఏ పనికి ఉపయో గించరు. తాము క్షేమంగా ఉండాలని తమకు నిత్యం జీవనోపాధిని కల్పించి సురక్షితంగా ఉంచాలని తాము చేపట్టిన ప్రతి ప్రయత్నంలో విజయం సాధించాలని విశ్వకర్మను ప్రార్థిస్తారు.

దేశం ఆనాడు ప్రథమ నాగరికత దేశంగా కీర్తిని పొందడానికి విశ్వకర్మ కర్మీయుల పరంపరే కారణమని విజ్ఞులు చెబుతారు. కార్మికశక్తికి ప్రతీకకంగా నిలిచిన విశ్వకర్మ జయంతిని జాతీయ పర్వదినంగా గుర్తించాలని బీఎంఎస్ సహా అనేక సంస్థల నుంచి ప్రభుత్వాలకు దశాబ్దాలుగా వినతులు అందుతూనే ఉన్నాయి.

-ఎ.చెన్నకేశవరావు, బీఎంఎస్ కేంద్ర కార్యవర్గ సభ్యులు