News

ఐరాసలో అభాసుపాలైన పాకిస్థాన్‌

230views

ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌కు ప్రపంచ వేదికపై మరోసారి అవమానం ఎదురైంది. పాకిస్థాన్‌ ఉగ్రవాదులను పోషించే దేశమని మానవ హక్కుల న్యాయవాది హిల్లెల్ న్యూయర్ ఆరోపించడంతో దాయాది దేశం అభాసుపాలైంది. అసలేమైందంటే..? హమాస్ నేతలను లక్ష్యంగా చేసుకొని ఖతార్‌లో ఇజ్రాయెల్‌ చేసిన దాడులపై ఐక్యరాజ్య సమితిలో చర్చలు జరిగాయి. ఇందులో భాగంగా మానవ హక్కుల న్యాయవాది, యూఎన్‌ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హిల్లెల్ న్యూయర్ మాట్లాడుతూ..ఖతార్‌ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. 2012 నుంచి ఖతార్‌ హమాస్ రాజకీయ కార్యాలయాన్ని నిర్వహిస్తోందని ఆయన అన్నారు. ఇజ్రాయెల్‌ దాడులకు పాల్పడిందనే విషయాన్ని ఖండించినందుకు యూఎన్‌ చీఫ్‌ ఆంటోనియో గుటెరస్‌ను హిల్లెల్ తప్పుబట్టారు.

2011లో పాకిస్థాన్‌లో అల్-ఖైదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్‌ను అమెరికా చంపినప్పుడు.. అప్పటి యూఎన్‌ చీఫ్ తగిన న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. దీంతో యూఎన్‌లో ఉన్న పాకిస్థాన్‌ ప్రతినిధి హిల్లెల్ ప్రసంగాన్ని మధ్యలో అడ్డుకొని అభ్యంతరం తెలిపారు. బిన్‌ లాడెన్ గురించి సభలో ప్రస్తావించడంపై మండిపడ్డారు. తమ దేశంపై చేసే నిరాధారమైన ఆరోపణలను తిరస్కరిస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం హిల్లెల్‌ మైక్‌ను పునరుద్ధరించిన యూఎస్‌హెచ్‌ఆర్‌సీ ఛైర్మన్‌ నాలుగు సెకన్లలో ప్రసంగాన్ని ముగించాల్సిందిగా ఆయనకు సూచించారు. దీంతో ఆగ్రహించిన హిల్లెల్‌ పాకిస్థాన్‌ కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశమేనని.. ఎన్నో ఏళ్లుగా ఉగ్రవాదులను పోషిస్తోందని పేర్కొంటూ ప్రసంగాన్ని ముగించారు. దీంతో తెల్లమొహం వేయడం పాక్‌ వంతైంది.