ArticlesNews

కనకదాసు కిటికీ

265views

కర్ణాటకలోని ఉడుపి పట్టణం శ్రీకృష్ణ మఠానికి ప్రసిద్ధి. ఇక్కడ భగవంతుడికీ, భక్తుడికీ మధ్య ఉన్న అచంచలమైన బంధానికి ప్రతీకగా నిలిచిన ఒక పవిత్ర ప్రదేశం ఉంది. అదే ‘కనకదాసు కిటికీ’.. దీన్నే కన్నడలో ‘కనకన కిండి’ అంటారు. ఇది కేవలం కిటికీ కాదు, ఆర్తితో కూడిన భక్తికి భగవంతుడు ఎలా స్పందిస్తాడు అన్నదానికి సాక్ష్యం.

పూర్వం ఒక గ్రామంలో శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులైన వీరమ్మ, బాచప్పలకు ఒక కుమారుడు జన్మించగా, ఆ పిల్లాడికి తిమ్మప్ప నాయకుడు అని నామకరణం చేశారు. కొన్నాళ్లకు తల్లిదండ్రులను కోల్పోయిన తిమ్మప్ప, దేశసంచారం చేస్తూ అనేక మంది గురువులను ఆశ్రయించి కన్నడ భాషలో పట్టు సాధించాడు. జీవనోపాధి కోసం సైన్యంలో చేరిన అతడు, గాయాలకు గురికావడంతో ఉద్యోగం నుంచి బయటకు వచ్చాడు. ఎవరో ఒక అపరిచిత వ్యక్తి తనకు సపర్యలు చేసి మామూలు స్థితికి తీసుకురాగా.. ఆ వ్యక్తి సాక్షాత్తూ శ్రీకృష్ణుడే అని నమ్మి మాధవునికి భక్తుడిగా మారిపోయాడు.

తిమ్మప్ప.. వ్యాసరాయల వారి ఆశ్రయం పొంది శిష్యరికం చేశాడు. ఒకసారి గురువు తన శిష్యులు అందరికీ తలొక అరటిపండు ఇచ్చి ఎవ్వరూ చూడని ప్రాంతంలో తిని రమ్మని పంపాడు. తిమ్మప్ప తప్ప అందరూ చాటు చూసుకొని పండు తిని వచ్చారు. తిమ్మప్పని ‘తినలేదేమి?’ అని గురువు ప్రశ్నించగా.. ‘భగవంతుడు అన్నిచోట్లా ఉన్నాడు, ఎవ్వరూ చూడని చోటేది?’ అని జవాబిచ్చాడు. తిమ్మప్ప భక్తి విశ్వాసాలు మెచ్చి వ్యాసరాయలు అతడికి కనకదాసు అని పేరు పెట్టారు.

ఒకసారి కనకదాసు ఉడుపి మఠానికి దర్శనార్థం వెళ్లగా.. వివిధ ఇబ్బందులతో అతడికి ప్రవేశం దొరకలేదు. అయినా అతడు మఠం వెనక వైపు వెళ్లి నిలబడి ఆర్తితో శ్రీకృష్ణ కీర్తనలు పాడటం ప్రారంభించాడు. ఆ గానంలోని మాధుర్యానికి, భక్తిలోని పవిత్రతకు ఆ శ్రీకృష్ణుడే కరిగిపోయాడట. అప్పుడే ఒక అద్భుతం జరిగిందట. కనకదాసు ఉన్న చోట మఠం వెనక గోడ అకస్మాత్తుగా బీటలు వారి ఒక చిన్న రంధ్రం(కిటికీ) ఏర్పడటమే కాదు.. అప్పటివరకు తూర్పుముఖంగా ఉన్న శ్రీకృష్ణుడి విగ్రహం తన భక్తుడికి దర్శనమివ్వడం కోసం పశ్చిమానికి తిరిగిందట. ఆ కిటికీగుండా కనకదాసు తన ప్రియమైన కృష్ణుడిని దర్శించుకున్నాడట. అదే కనకన కిండిగా ప్రాచుర్యం పొందింది.