News

ప్రముఖ ఆలయాలకు మన్యం జీడిపప్పు

165views

పార్వతీపురం మన్యం జిల్లాకు మరో గుర్తింపు దక్కింది. ఇక నుంచి ప్రముఖ దేవాలయాల ప్రసాదాల్లో మన్యం జీడి పప్పు వినియోగించనున్నారు. జిల్లాలో తయారవుతున్న పప్పు దేవాలయాలకు సరఫరా చేసేందుకు అర్హమైందని సంబంధిత విభాగం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో దేవాదాయశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

జిల్లాలో 67 వేల ఎకరాల్లో జీడి తోటలున్నాయి. రసాయనాలు లేని నాణ్యమైన దిగుబడి ఏటా 12 వేల టన్నుల వరకు వస్తోంది. ప్రాసెసింగ్‌ లేక ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని మార్కెట్‌ యార్డులో వన్‌ధన్‌ వికాస్‌ యోజన జీడి పప్పు తయారీ కేంద్రాన్ని కలెక్టర్‌ చొరవతో ఇటీవల ఏర్పాటు చేశారు. ప్రాసెస్‌ ప్రారంభమైంది. డీఆర్‌డీఏ పర్యవేక్షణలో యూనిట్‌ నడుస్తోంది. ఈ నేపథ్యంలో దేవాదాయ శాఖ నిర్ణయం రైతులకు వరంలా మారనుంది.
ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ గుర్తింపు..

దేవాలయాల్లో తయారవుతున్న ప్రసాదాలు, ఆహారంలో వినియోగించే ఏ వస్తువైనా ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) గుర్తింపు పొందాలి. జిల్లా జీడిపప్పునకు అన్ని విధాలా అర్హత ఉన్నట్లు ఆ సంస్థ గుర్తింపు ఇచ్చింది. నాణ్యత, ఇతర ప్రమాణాలు కలిగి ఉన్నట్లు ధ్రువీకరించడంతో దేవాదాయశాఖ కమిషనర్‌ రామచంద్రమోహన్‌ అంగీకారం తెలిపారు.

సింహాచలం వరాహ లక్ష్మీనరసింహస్వామి, అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి, తిరుపతి వేంకటేశ్వరస్వామి, విజయవాడ కనకమహాలక్ష్మీ, అరసవల్లి సూర్యనారాయణమూర్తి, కాకినాడ జిల్లా తుని మండలం లోవ కొత్తూరు తలుపులమ్మతల్లి ఆలయాలకు జీడిపప్పు సరఫరా చేసేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఎంతో చక్కని అవకాశమని, మార్కెట్‌ విస్తృతం కానుందని డీఆర్‌డీఏ పీడీ సుధారాణి చెప్పారు.