ArticlesNews

ఔరంగజేబు దుర్మార్గం – కాశీ విశ్వనాథ మందిర ధ్వంసం

257views

పరమేశ్వరుడి ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఉత్కృష్టమైనది కాశీ విశ్వనాథ మందిరం. పురావస్తు పరిశీలనల ప్రకారం ఆ ఆలయ నిర్మాణం పూర్వ సామాన్య శకం 9-10 శతాబ్దాల మధ్య కాలంలో జరిగింది. గుప్తుల కాలంలో ఆ గుడిని మహా అద్భుతంగా, వైభవోపేతంగా పునర్నిర్మించారు. ఆ విషయాన్ని చైనా దేశపు చరిత్రకారుడు హుయాన్‌ త్సాంగ్ తన రచనల్లో ప్రస్తావించారు. కాశీ మహానగరంలోని విశ్వనాథుడి ఆలయం ఆసేతు శీతాచలం హిందూ విశ్వాసాలకు కేంద్రస్థానం అని గ్రహించిన దుర్మార్గులైన దురాక్రమణదారులు ఆ ఆలయాన్ని నాశనం చేసారు. చరిత్ర గతి లోని వివిధ సందర్భాల్లో మొహమ్మద్ గోరీ, మహమూద్ షర్కీ, ఔరంగజేబు వంటి ముస్లిం రాజులు విశ్వనాథ మందిరాన్ని పలుమార్లు ధ్వంసం చేసారు. అయితే మందిరాన్ని అందరికంటె తీవ్రంగా, దారుణంగా నాశనం చేసిన దుర్మార్గుడు ఔరంగజేబు. సామాన్య శకం 1669 సెప్టెంబర్ 2వ తేదీన ఔరంగజేబు కాశీ విశ్వనాథ మందిరాన్ని ధ్వంసం చేసాడు. ఆ గుడి ఉన్న చోటనే మసీదు నిర్మించాడు.

కాశీ విశ్వనాథ ఆలయాన్ని దర్శించుకునే ప్రజలు అందరూ భగవాన్ శివుడి వాహనమైన నందీశ్వరుడి సుందరమూ, సౌమ్యమూ అయిన విగ్రహాన్ని చూస్తారు. ఆ నంది మూర్తి ఎక్కడ ఉందో, ఎటువైపు చూస్తున్నట్లుగా ఉందో గమనిస్తే జరిగిన దారుణం అర్ధమైపోతుంది. నందీశ్వరుడి విగ్రహం సుమారు 7 అడుగుల ఎత్తు ఉంటుంది. అది జ్ఞానవాపి మసీదు గోడ దగ్గర ఉంటుంది. హిందువుల పరంపరాగతమైన వాస్తుకళ గురించి ఏమాత్రం తెలిసిన వారికి అయినా, శివాలయాల్లో నందీశ్వరుడి విగ్రహాన్ని ప్రధానంగా పరమేశ్వరుడి మూలమూర్తికి దగ్గరలో ప్రతిష్ఠాపిస్తారు, అనే విషయం తప్పకుండా తెలుస్తుంది.

మొగలు పాదుషా ఔరంగజేబు 1669 సెప్టెంబర్‌లో వారణాసి మీద దాడి చేసాడు. కాశీ విశ్వనాథ మందిరాన్ని సమూలంగా ధ్వంసం చేయాలంటూ తన సైన్యానికి ఆదేశాలు జారీ చేసాడు. ఆ విషయం తెలిసిన ఆలయ పూజారులు శివలింగాన్ని గర్భగుడి నుంచి తప్పించి ఒక బావిలో దాచిపెట్టారు. ఆ బావి కాశీ విశ్వనాథ ఆలయానికీ, జ్ఞానవాపి మసీదుకూ మధ్యన ఉంది. ఆలయాన్ని ధ్వంసం చేద్దామని వచ్చిన దుర్మార్గులకు అసలు మందిరంలో మూలవిరాట్టు అయిన శివలింగమే కనిపించలేదు.

ముస్లిం దురాక్రమణదారులు విగ్రహాలను ధ్వంసం చేసేవారు అన్న సంగతి ప్రపంచ చరిత్రలోనే నమోదు చేయబడి ఉంది. హిందువులు అనునిత్యం భక్తిశ్రద్ధలతో పూజించే మూర్తులను వికారంగా ధ్వంసం చేయడాన్ని ముస్లిం దురాక్రమణదారులు ఒక రివాజుగా పెట్టుకున్నారు. ఎందుకంటే, దెబ్బ తిన్న విగ్రహాలకు పూజలు జరపరు. వాటి స్థానంలో కొత్త విగ్రహాలను ప్రతిష్ఠించుకుని వాటికి పూజలు చేస్తారు. అందుకే ముస్లిములు ఆలయాలలోని శిల్పకళను ధ్వంసం చేసి, వాటిలోని విగ్రహాలను వికృతంగా విరగ్గొట్టి పైశాచిక ఆనందం పొందేవారు. అదే విధంగా విశ్వనాథ ఆలయం మీద కూడా దాడి చేసిన ఔరంగజేబు సేన నందీశ్వరుడి విగ్రహాన్ని పగలగొట్టేందుకు దానివైపు వెళ్ళినప్పుడు తేనెటీగల గుంపు వారి మీద దాడి చేసింది.

కాశీ విశ్వనాథ మందిరం మీద ఔరంగజేబు దురాక్రమణ:
— మొగల్ పాదుషా ఔరంగజేబు పరిపాలనా కాలం నాటి ఒక చారిత్రక రచన మాసిర్ ఎ ఆలంగిరీ. ఆ పుస్తకాన్ని సాకీ ముస్తయిద్ ఖాన్ రచించాడు.

— ఔరంగజేబు పరిపాలించిన కాలం గురించి ముస్తయిద్ ఖాన్ తన మాసిర్ ఎ ఆలంగిరీలో వివరంగా రాసుకొచ్చాడు. దాని ప్రకారం 1669 ఏప్రిల్ 8,9 తేదీల్లో ఔరంగజేబు తన సుబేదారు అయిన అబుల్ హసన్‌కు కాశీ నగరానికి వెళ్ళి అక్కడి దేవాలయాలు, విద్యాలయాలను ధ్వంసం చేయాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాడు.

— ఔరంగజేబు కాశీ నగరాన్నే ఎందుకు ప్రధానంగా తన లక్ష్యంగా చేసుకున్నాడంటే దానికి ఒక నిర్దిష్టమైన కారణం ఉంది. అప్పట్లో కాశీ నగరం కేవలం హిందువుల భక్తి విశ్వాసాలకు ఆలవాలంగా ఉండేది మాత్రమే కాదు. వేదాలు, ధర్మశాస్త్రాల అధ్యయనానికి కూడా కాశీ నగరమే ప్రముఖ కేంద్రస్థానంగా ఉండేది. ఆసేతు శీతాచలం ఎక్కడి నుంచి అయినా ఎవరైనా విద్యను ఆర్జించాలంటే కాశీ నగరానికి వెళ్ళవలసిందే.

— ఔరంగజేబు ఆదేశాల మేరకు అబుల్ హసన్ భారీ సైన్యాన్ని తీసుకుని కాశీ వెళ్ళాడు. అక్కడ అతను దాదాపు ఆరు నెలలు హిందువులతో యుద్ధం చేసాడు. చివరికి 1669 సెప్టెంబర్ 2న కాశీ విశ్వనాథ మందిరం సహితంగా వారణాసిలోని అన్ని దేవాలయాలనూ, అన్ని పాఠశాలలనూ ధ్వంసం చేయడంలో విజయవంతం అయ్యాడు.

— కాశీ విశ్వనాథ మందిరాన్ని పగులగొట్టిన తర్వాత అబుల్ హసన్, తన ప్రభువైన ఔరంగజేబుకు అదే విషయాన్ని లేఖ ద్వారా తెలియపరిచాడు. కాశీ విశ్వనాథ మందిరాన్ని ధంసం చేసామనీ, అక్కడ మసీదు నిర్మించామనీ ఆ లేఖలో అబుల్ హసన్ రాసుకొచ్చాడు.

ఔరంగజేబును పరుగులు పెట్టించిన నాగా సాధువులు:
— నిజానికి 1669 కంటె ఐదేళ్ళ ముందు, అంటే 1664లోనే మొగల్ పాదుషా ఔరంగజేబు మొదటిసారి కాశీ విశ్వనాథ ఆలయాన్ని ధ్వంసం చేయాలనే ఉద్దేశంతో వారణాసి నగరం మీద దాడి చేసాడు. ఆ దాడి ప్రధాన లక్ష్యం హిందువుల ధార్మిక భావనలను సమూలంగా పెళ్ళగించి వేయడమే. కానీ అప్పుడు ఔరంగజేబు ప్రయత్నం ఫలించలేదు.

— కాశీలోని మహా నిర్వాణీ అఖాడాకు చెందిన నాగా సాధువులు విశ్వనాథ మందిరానికి రక్షణగా నిలిచారు. ఔరంగజేబు, అతని సైన్యాన్ని ఎదుర్కొని ధైర్యంగా పోరాడారు. నాగా సాధువుల వీరత్వం ముందు ఔరంగజేబు మొగలు సేనలు నిలువలేకపోయాయి, దాంతో ఔరంగజేబుకు వెనుకకు మళ్ళిపోక తప్పలేదు.

— మహా నిర్వాణీ అఖాడాకు చెందిన వేలాది మంది సాయుధులైన నాగా సన్యాసులు ఆలయానికి చేరుకున్నారు. రమణ గిరి, లక్ష్మణ గిరి మౌని, దేశ గిరి నఖ్ఖీ మహరాజ్ వంటివారు ఆ నాగా సాధువులకు నేతృత్వం వహించారు. ఔరంగజేబు సైన్యం రాజా హరిదాస్ కేసరి, నరేంద్ర దాస్‌ల సేనలను నలువైపుల నుంచీ చుట్టుముట్టేసింది. అప్పుడే నాగా సన్యాసుల సైన్యం ఔరంగజేబుతో యుద్ధం చేసి అతన్ని ఓడించివేసింది.

— అమెరికాకు చెందిన రచయిత జేమ్స్ జి లోచ్‌టేఫేల్డ్ తన రచన అయిన ‘ది ఇలస్ట్రేటెడ్ ఎన్‌సైక్లోపీడియా ఆఫ్ హిందూయిజం (మొదటి సంపుటం)’లో ఆ యుద్ధం గురించి సవిస్తరంగా రాసుకొచ్చారు. వారు ఆ యుద్ధం గురించి రాసిన వివరాలు మహానిర్వాణీ అఖాడాకు సంబంధించిన రికార్డుల నుంచి ఆ వివరాలు సంపాదించాడు.

— చరిత్రకారుడు జదునాథ్ సర్కార్‌ తన రచన ‘A history of the Dasnami Naga Sannyasis’ అనే గ్రంథంలో నాగా సాధువుల యుద్ధం గురించి రాసాడు. మొదటిసారి ఓటమి తర్వాత ఔరంగజేబు రెండవ సారి 1669 ఏప్రిల్‌లో కాశీ నగరం మీద దాడికి పిలుపునిచ్చాడు. ఆ సమయంలోనే దాదాపు ఆరు నెలల పాటు యుద్ధం జరిగింది. నాగా సాధువులు మరొక్కసారి మళ్ళీ మొగలు సేనలతో యుద్ధం చేసారు.
— యుద్ధంలో కనీసం 40 వేల మంది నాగా సాధువులు దేవాలయానికి రక్షణగా నిలిచి, ఆ సేవలో ఉండగానే తమ ప్రాణాలను బలిదానం చేసారు. ఈసారి ఔరంగజేబు కాశీ విశ్వనాథ మందిరాన్ని ధ్వంస చేయడంలో సఫలుడు అయ్యాడు. హిందువులు మరోసారి దేవాలయాన్ని నిర్మించకూడదని ఔరంగజేబు నిర్ణయించుకున్నాడు. అందుకే ఆలయం ఉన్న స్థలంలో మసీదును నిర్మించేసాడు.

ఆలయాన్ని పునర్నిర్మించిన అహిల్యాబాయి హోల్కర్:
— ఔరంగజేబు దాడి చేసిన దాదాపు వంద సంవత్సరాల తర్వాత 1780వ సంవత్సరంలో ఇందోర్ మహారాణి అహిల్యాబాయి హోల్కర్, జ్ఞానవాపి మసీదు దగ్గర శివాలయాన్ని జీర్ణోద్ధరణ చేసారు, పునర్నిర్మాణం చేసారు. తర్వాత ఆ పనులను పంజాబ్‌కు చెందిన మహారాజా రంజీత్ సింగ్ కొనసాగించారు.

— మహారాజా రంజీత్ సింగ్ పంజాబ్ నుంచి వెయ్యి కిలోగ్రాముల బంగారాన్ని కాశీ నగరానికి పంపించారు. విశ్వనాథ మందిరం గర్భగుడిని అలంకరించడానికి ఆ బంగారాన్ని ఉపయోగించారు. ఆ ఆలయం గర్భగుడిలోనే ప్రస్తుతం కాశీ విశ్వనాథుడు కొలువై ఉన్నాడు. ఈ గుడి అసలైన ఆలయం మూల స్థలానికి కొద్ది దూరంలోనే ఉంది, కానీ అసలైన చోట లేదు.

— ఈ గుడికి కొత్త రూపు ఇవ్వడానికి కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం, ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కలిసి హైటెక్ కాశీ విశ్వనాథ్ కారిడార్‌కు రూపకల్పన చేసాయి. ఆ కారిడార్ నిర్మాణానికి రూ.700 కోట్లు వ్యయం అవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 14న ఆ కారిడార్ ప్రారంభోత్సవం చేసారు.

విశ్వనాథ ఆలయం మూడుసార్లు ధ్వంసం:
ఔరంగజేబు కంటె ముందు కాశీ విశ్వనాథ ఆలయాన్ని మొహమ్మద్ గోరీ, మహమూద్ షర్కీ వంటి ముస్లిం దురాక్రమణదారులు కూడా ధ్వంసం చేసారు. మొహమ్మద్ గోరీ సామాన్య శకం 1194లో ఆ గుడిని లూటీ చేసి ధ్వంసం చేసాడు. సామాన్య శకం 1447లో జౌన్‌పూర్‌కు చెందిన ముస్లిం సుల్తాను మహమూద్ షా గుడిని పగలగొట్టించాడు.

ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగింది?
కాశీలో గంగానది పశ్చిమం ఒడ్డున ఉన్న కాశీ విశ్వనాథుడి ఆలయం చరిత్ర వేల యేళ్ళ పురాతనమైనది. పూర్వ సామాన్య శకం 11వ శతాబ్దంలో రాజా హరిశ్చంద్ర ఈ ఆలయాన్ని జీర్ణోద్ధరణ చేయించాడని ఐతిహ్యం. ఆలయానికి పునాది ఎవరు వేసారు అనే విషయం గురించి స్పష్టమైన సమాచారం ఏదీ అందుబాటులో లేదు.

సామాన్య శకం 1448లో ముస్లిం సుల్తాను మహమూద్ షా ఆలయాన్ని ధ్వంసం చేయించాడు. ఆ తర్వాత 1585లో రాజా తోడర్‌మల్ సహకారంతో పండిత నారాయణ భట్టు విశ్వనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయించారు.

శివలింగాన్ని పూజారులే బావిలో పడేసారు, ఎందుకంటే….
— సామాన్య శకం 1669లో ఔరంగజేబు సైన్యాలు కాశీ విశ్వనాథ ఆలయం మీద రెండోసారి దాడి చేసాయి. నాగా సాధువులు మొగలు సైన్యాలతో కలబడి యుద్ధం చేసారు. ఆ యుద్ధంలో 40వేల మంది నాగా సాధువులు అమరులయ్యారు.

— ఆ దాడి తరువాత శివలింగాన్ని ఔరంగజేబు ముక్కలు ముక్కలుగా చేయకుండా ఉండబోడని గుడి పూజారులు అర్ధ: చేరసుకున్నారు. ఔరంగజేబు నుంచీ శివలింగాన్ని రక్షించుకోడానికి, దాన్ని జ్ఞానవాపి బావిలో స్థాపితం చేసారు. ఆ బావిలో నేటికీ స్వయంభూ జ్యోతిర్లింగ రూపంలో కాశీ విశ్వేశ్వరుడు ఉన్నాడని భక్తులు విశ్వసిస్తారు.

జ్ఞానవాపి బావి పౌరాణిక మహత్యం:
— వాపి అంటే సంస్కృత భాషలో బావి అని అర్ధం. జ్ఞానవాపి అంటే తెలివిడి అనే బావి. చాలా కాలం క్రితం, నదులు, వర్షాలు అనే వ్యవస్థ ఏర్పాటు అవడానికంటె చాలా ముందు, భూమి మీద నీటి సముద్రం లేక పాల సముద్రం తప్ప ఇంకెక్కడా నీరు లేదు. అలాంటి సమయంలో ఈశాన భగవానుడు కాశీ వచ్చారు. అక్కడ ఆయన వెలుగు యొక్క విశాలమైన అనంతమైన ఒక స్తంభాన్ని చూసారు. ఆ పవిత్ర జ్యోతిర్లింగ మూర్తికి దేవతలు పూజాదికాలు చేస్తున్నారు.

— ఆ దివ్య శివలింగాన్ని చూసిన ఈశానుడి మనసులో అభిషేకం చేయాలనే కోరిక కలిగింది. అయితే అప్పుడు నీరు అందుబాటులో లేదు. అందువల్ల ఈశానుడు తన త్రిశూలాన్ని నేల మీదకు విసిరాడు. దానివల్ల జ్ఞానవాపికి దక్షిణం వైపు నీరు ప్రవహించసాగింది., ఆ నీటితో ఈశానుడు వేలాది కలశాలను నింపి, ఆ లింగానికి అభిషేకం చేసారు.

— ఈశానుడు చేసిన పూజతో విశ్వనాథుడు ప్రసన్నుడయ్యాడు. అప్పటినుంచీ ఆ తీర్థం ‘శివ తీర్థం’ అనే పేరుతో ప్రజాదరణ పొందుతుంది అని వరం ఇచ్చారు. శివ అనే పదానికి మరో అర్ధం విద్వాంసుడు అని ఉంది. ఆ శివ భగవానుడి ఆశీర్వాదం వల్ల వైదిక జ్ఞానం ఆ జలంలో ద్రవరూపంలో ప్రకటితమైంది. అందుకే ఆ తీర్థం జ్ఞానోదకం అని పేరు గడించింది. దాన్నే వర్తమానంలో మనం ‘జ్ఞాన వాపి’ అనే పేరుతో వ్యవహరిస్తున్నాము.