చిన్నతనం నుంచి అమ్మ మన కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది. తన కోరికలను పక్కన పెట్టి అణుక్షణం మన గురించే ఆలోచిస్తుంది. అలాంటి అమ్మ రుణాన్ని తీర్చుకోవడం మనకు సాధ్యం కాదు. అలాంటిది ఒకవేళ ఆ తల్లి కోరికను తీర్చే అవకాశం మనకి వస్తే! అలాంటి అరుదైన అవకాశాన్ని వదులు కోవాలని ఏ కుమారుడు అనుకోడు. అదే విధంగా తన తల్లి కోరికను తీర్చే అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ఓ కుమారుడు. కేదార్‌నాథ్ దర్శనం చేయాలన్న తన తల్లి జీవితకాల కోరికను అతడు నెరవేర్చాడు. దాని కోసం 1,800 కిలోమీటర్లకు పైగా విస్తరించిన కఠినమైన పాదయాత్రను, తన తల్లిని భుజాలపై మోసుకుంటూ పూర్తి చేశాడు. తల్లిపట్ల అతడికి ఉన్న అపారమైన ప్రేమ, అంకితభావం, సేవాభావానికి ఈ యాత్రతో నిరూపించాడు.
ఎటువంటి వాహనాల సాయం లేకుండా
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బదాయూ జిల్లాకు చెందిన ధీరజ్ తల్లి, బాబా కేదార్‌నాథ్ దర్శనం చేసుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అందుకే తన తల్లి కోరికను తీర్చడానికి ధీరజ్ ఓ దృఢమైన సంకల్పం చేసుకున్నారు. దానికోసం ఎటువంటి మోటారు వాహనాలు లేదా ప్రత్యేక రవాణా సాధనాలపై ఆధారపడకుండా, మొత్తం ప్రయాణాన్ని కాలినడకన పూర్తి చేయాలని ఆయన నిర్ణయించుకున్నారు. మార్గమధ్యలో ప్రతికూల వాతావరణ పరిస్థితులు, శారీరక అలసటతో సహా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నప్పటికీ, ఆయన ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు.
మూడు నెలల 24 రోజుల్లోనే యాత్ర
తన తల్లిని భుజాలపై మోసుకుంటూ 1,800 కిలోమీటర్లు అవిశ్రాంతంగా ముందుకు సాగారు. అలా ధీరజ్ తన తల్లితో పాటు ఈ యాత్రను కేవలం మూడు నెలల 24 రోజుల్లోనే పూర్తి చేశారు. దాంతో అక్కడ ఉన్న భక్తులు, స్థానికులు ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అటువంటి అసాధారణమైన భక్తిని, అంకితభావాన్ని చూసి, చాలా మంది కళ్లు భావోద్వేగంతో చెమ్మగిల్లాయి. ఇప్పుడు, ధీరజ్ తన తల్లితో కలిసి బాబా కేదార్‌నాథ్ ఆశీస్సులు పొందేందుకు చేరువలో ఉన్నారు. ధీరజ్ ప్రయాణం ఒక కుమారుడికి తన తల్లిపై ఉన్న ప్రేమకు నిదర్శనంగా నిలవడమే కాకుండా, నిజమైన విశ్వాసం, చెక్కుచెదరని సంకల్పం ముందు ఎటువంటి దూరం లేదా కష్టం అసాధ్యం కాదని నిరూపిస్తుంది. నేటి కాలంలో, ఈ కథ అనేక మందికి స్ఫూర్తిదాయకంగా నిలిస్తుందని స్థానికులు భావిస్తున్నారు.





